కవాడిగూడ, ఫిబ్రవరి 5 : 2014 అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేసిన ఘనత కేసీఆర్‌దేనని ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ అన్నారు. ఏకగ్రీవంగా వర్గీకరణ తీర్మానం చేసిన కేసీఆర్.. స్వయంగా ప్రధాని మోదీని కలిసి ఎస్సీ వర్గీకరణ కావాలని విజ్ఞప్తిచేసినట్టు గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన నేపథ్యంలో.. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు యాతాకుల భాస్కర్‌తో కలిసి బుధవారం ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వంగపల్లి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాడు అసెంబ్లీలో తీర్మానం చేయడంతోపాటు వర్గీకరణ కోసం పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి చేసినట్టు గుర్తుచేశారు. మంగళవారం అసెంబ్లీలో వర్గీకరణ చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్, కవితకు వంగపల్లి అభినందనలు తెలియజేశారు. ఈ విజయం ప్రతిఒక్క మాదిగ బిడ్డదని పేర్కొన్నారు. ఈ విజయాన్ని అమరవీరులకు అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. మార్చి 1న మాదిగ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.
మాదిగలు, ఉపకులాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ దండోరా ఉద్యమంలో ఎంతోమందిపై కేసులు నమోదయ్యాయని, వాటిని తక్షణమే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో వర్గీకరణ తీర్మానం ఆమోదించిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. వర్గీకరణతోనే మాదిగలకు రాజ్యాధికారం దక్కుతుందని, మాలలు కలిసివస్తే సమిష్టిగా అభివృద్ధి చెందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కోర్ కమిటీ సభ్యులు మధు, శ్రీనివాస్, రమేశ్, కృష్ణ, సంజీవ, యాకయ్య, యాదగిరి, జిల్లాల అధ్యక్షులు శాంతికిరణ్, సాగరం, నరేందర్, రాజేందర్, గంగాధర్, నరేశ్, రాజన్న, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.