హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు డిమాండ్‌తో సీపీఎం చేపట్టిన చలో రాజ్‌భవన్ ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించేందుకు హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ నుంచి ర్యాలీగా బయల్దేరిన నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు. కానీ వారిని కలిసేందుకు గవర్నర్ అనుమతివ్వకపోవడంతో రాజ్‌భవన్ గేటు వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో సీపీఎం నేతలు అకడే బైఠాయించారు. బీసీలకు వ్యతిరేకంగా గవర్నర్ మొండివైఖరితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అపాయింట్మెంట్ ఇచ్చే వరకు కదిలే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు.
కేంద్ర ప్రభుత్వం, బీజేపీ బీసీ వ్యతిరేక విధానాలు వీడాలని నినాదాలు చేశారు. గవర్నర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి వాహనాల్లో స్టేషన్‌కు తరలించారు. సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన గవర్నర్.. కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గవర్నర్ తీరుకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం, మోటార్ సైకిల్ ర్యాలీ తదితర రూపాల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. గవర్నర్ తీరు మార్చుకోకుంటే ఆయన బదిలీ కోరాల్సి వస్తుందని హెచ్చరించారు.
బీసీ జేఏసీ బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తేనే సీపీఎం పాల్గొంటుందని జాన్ వెస్లీ స్పష్టం చేశారు. చలో రాజ్‌భవన్ ర్యాలీ ఖైరతాబాద్ వద్ద ప్రారంభానికి ముందు ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చే అధికారం కేంద్రానికే ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం న్యాయపోరాటాలకే పరిమితం కావడం సరికాదని జాన్‌వెస్లీ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్షం తీసుకునే నిర్ణయాలకు సీపీఎం మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. చలో రాజ్‌భవన్ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, సీనియర్ నేతలు నాయకులు ఎస్ వీరయ్య, మహమ్మద్ అబ్బాస్, జ్యోతి, సాగర్, నంద్యాల నర్సింహారెడ్డి, బండారు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.