జగిత్యాల, మే 19 (నమస్తే తెలంగాణ): మండలాల పరిపాలనలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మండలాభివృద్ధి అధికారులకు వాహన సౌకర్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. 2023 మార్చి వరకు మండలాభివృద్ధి అధికారులకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అద్దె వాహనం కోసం నెలకు రూ. 33వేలను చెల్లిస్తూ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అద్దె వాహనాలకు నిధులు ఇవ్వకపోవడంతో ఎంపీడీవోలు జేబుల నుంచి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు ఉన్న ఆర్థిక సంవత్సరంలోను, 2025-2026 ఆర్థిక సంవత్సరంలోను ఎంపీడీలకు అద్దె వాహనాలను ఏర్పాటు చేసుకునే ప్రొవిజన్‌ను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. ఎంపీడీవోలకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద నుంచి అద్దె వాహనాలు పెట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది.
ప్రభుత్వం అద్దె వాహనాలను తీసివేయడంతో ఎంపీడీవోలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనం లేకుండా మండలాన్ని ఎలా పర్యవేక్షించాలో అర్థం కావడం లేదని ఎంపీడీవోలు వాపోతున్నారు. 2023 ఏప్రిల్‌లో అప్పటి ప్రభుత్వం అద్దె వాహనానికి ప్రొవిజన్ ఇచ్చిందని, 12 నెలలకు ఒక్కో ఎంపీడీవోకు రూ. 4 లక్షలు అద్దె చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని, రెండేండ్లుగా వాహనం లేక ఇబ్బందిపడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
2023 ఏప్రిల్ నుంచి నిధులు ఇవ్వని ప్రభుత్వం 2026 మే, జూన్‌లో ప్రైవేట్ వాహనాలు ఏర్పాటు చేసుకునేందుకు ఉత్తర్వులు ఇచ్చిందని, ఇది ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. గ్రామాల పరిపాలన సక్రమంగా జరిగి ప్రజలకు సరైన పాలన కావాలంటే ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.