Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం రాకాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించగా, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం, రాకా లో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొదట విడుదలైన పోస్టర్లో బన్నీ బీస్ట్ తరహా పవర్ఫుల్ లుక్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. అయితే సినిమాలో ఆయన ఒకే పాత్రకే పరిమితం కాకుండా తాత, తండ్రి, ఇద్దరు కుమారులుగా మొత్తం నాలుగు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
అట్లీ సినిమాల్లో మల్టిపుల్ రోల్స్‌కు ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. గతంలో ‘అదిరింది’ చిత్రంలో విజయ్ను మూడు విభిన్న పాత్రల్లో చూపించిన ఆయన, విజిల్ లో ద్విపాత్రాభినయం చేయించారు. అలాగే బాలీవుడ్లో తెరకెక్కించిన ‘జవాన్’ చిత్రంలో షారుఖ్ ఖాన్‌ను తండ్రీ-కొడుకులుగా రెండు పాత్రల్లో చూపించి భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో ‘రాకా’లో కూడా కథకు అనుగుణంగా మల్టిపుల్ రోల్స్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. మొదట తాత, తండ్రి పాత్రలకు వేరే నటులను తీసుకోవాలని చిత్రబృందం భావించిందని, అయితే అల్లు అర్జున్ స్వయంగా నాలుగు పాత్రలని తానే చేయాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అట్లీ తొలుత సందిగ్ధంలో పడినా, లుక్ టెస్ట్స్లో బన్నీ చూపించిన బాడీ లాంగ్వేజ్, గెటప్ వేరియేషన్స్ చూసిన తర్వాత నాలుగు పాత్రలూ ఆయనే చేయడం సినిమాకు మరింత బలం చేకూరుస్తుందని నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇది నిజమైతే అల్లు అర్జున్ కెరీర్లోనే తొలి మల్టిపుల్ రోల్ సినిమా అవుతుంది. ఇప్పటివరకు ఆయన ద్విపాత్రాభినయం కూడా చేయలేదు. దీంతో ‘రాకా’లో నాలుగు పాత్రలు చేయనున్నారనే వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారనే ప్రచారం చాలా రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఈ ప్రాజెక్ట్‌లో భాగమని అధికారికంగా ప్రకటించారు. అలాగే రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ మలయాళ నటి ఫెమినా జార్జ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.