Nag Ashwin | పాన్ ఇండియా దర్శకుడు నాగ్ అశ్విన్ సాధారణంగా సోషల్ మీడియాలో వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే తన బ్లాక్‌బస్టర్ చిత్రం కల్కి 2898 AD పై గత కొద్ది రోజులుగా వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయన తొలిసారి మౌనం వీడి స్పందించారు. ముఖ్యంగా అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ సినిమా విడుదలైన తర్వాత మొదలైన పోలికలు, కర్ణుడి పాత్రపై వస్తున్న కామెంట్లకు నాగ్ అశ్విన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. జూలై 10న విడుదలైన అఖిల్ అక్కినేని ‘లెనిన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో కన్నడ నటుడు ప్రమోద్ పంజు పోషించిన వసంత్ పాత్రకు ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు లభిస్తున్నాయి. ఆయన నటనను కొనియాడుతూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
ఆ పోస్ట్‌లో సిల్వర్ స్క్రీన్‌పై కర్ణుడి పాత్రను ఇలా చూపించాలి అని పేర్కొనడంతో, కొందరు నెటిజన్లు ‘కల్కి 2898 AD’లో కర్ణుడి పాత్ర చిత్రీకరణపై విమర్శలు చేయడం ప్రారంభించారు. సినిమాలో కర్ణుడిని అతిగా గ్లోరిఫై చేశారని, మహాభారతంలోని అసలు కథకు భిన్నంగా కొన్ని అంశాలను చూపించారని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వివాదం రోజురోజుకూ పెరగడంతో, ఇంతకాలం స్పందించని నాగ్ అశ్విన్ ఎట్టకేలకు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రముఖ ఆర్థికవేత్త, రచయిత వివేక్ దేబ్రాయ్ ఆంగ్లంలో అనువదించిన మహాభారతం పుస్తకంలోని ఒక పేజీని షేర్ చేస్తూ విమర్శలకు సమాధానం ఇచ్చారు.
ఆ పోస్ట్‌లో ఆయన, ఇవి ద్రోణ వధ పర్వంలో అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు. దయచేసి మహాభారతం చదవండి. ముఖ్యంగా వివేక్ దేబ్రాయ్ అనువాదాన్ని చదవాలని నేను సూచిస్తున్నాను అని పేర్కొన్నారు. అంతేకాదు, శ్రీకృష్ణుడు అర్జునుడి ఎదుట కర్ణుడిని ఎన్నిసార్లు ప్రశంసించాడో ఒకసారి తెలుసుకోండి. మన చరిత్రపై నాకు ఎంతో గౌరవం ఉంది. నేను ఏం చేస్తున్నానో నాకు పూర్తిగా తెలుసు. ‘కల్కి పార్ట్ 2’ కోసం వేచి ఉండండి అంటూ నాగ్ అశ్విన్ ధీమాగా స్పందించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా “వెయిట్ ఫర్ పార్ట్ 2” అనే ఒక్క మాటతోనే సీక్వెల్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచేశారు.
‘కల్కి 2898 AD’ మొదటి భాగంలో ప్రభాస్ నటన, విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, సంతోష్ నారాయణన్ అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే కర్ణుడి పాత్రను ఎలా చూపించారనే అంశంపై అప్పటి నుంచే కొంత చర్చ కొనసాగుతోంది. తాజాగా ‘లెనిన్’ సినిమా తర్వాత ఆ చర్చ మళ్లీ తెరపైకి రావడంతో నాగ్ అశ్విన్ నేరుగా స్పందించారు.నాగ్ అశ్విన్ ఇచ్చిన సమాధానం తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు విస్తృతంగా చర్చిస్తున్నారు. రెండో భాగంలో కర్ణుడి పాత్రకు మరింత ప్రాధాన్యం ఉంటుందా? మహాభారతానికి సంబంధించిన మరిన్ని అంశాలను ఎలా చూపించబోతున్నారు? అనే అంశాలపై ఆసక్తి వ్యక్తమవుతోంది.