Social Media | హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, పాలనలోని లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న సోషల్ మీడియా వారియర్లపై కాంగ్రెస్ సర్కార్ యుద్ధం మొదలుపెట్టింది. తమకు కొరకరాని కొయ్యగా మారిన సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. సోషల్ మీడియా వారియర్లను బెదిరించేందుకు అరెస్టుల పర్వాన్ని తెరమీదికి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో కొన్ని నెలలుగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. దీనిని సోషల్ మీడియా ఎత్తిచూపుతున్నది.
ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నాయకులు చేస్తున్న కుట్రలను, అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తున్నది. వీటిపై ప్రజలు సైతం అదే స్థాయిలో స్పందిస్తున్నారు. ఈ పరిణామాలు ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. నమస్తే తెలంగాణ, టీ న్యూస్, సాక్షి వంటి కొన్ని మీడియా సంస్థలు తప్ప మిగతా ప్రధాన పత్రికలు, టీవీలన్నీ ప్రభుత్వం నియంత్రణలోకి వెళ్లిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఇందుకు ప్రభుత్వం వివిధ మార్గాలు అనుసరించిందని చెప్పుకుంటున్నారు. కానీ సోషల్ మీడియా మాత్రం కొరకరాని కొయ్యగా మారిపోయింది. దానిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం నానా అవస్థలు పడుతున్నది. ధీటుగా అధికార పార్టీ సోషల్ మీడియాలో వెనుకబడిపోయిందని స్వయంగా పలువురు మంత్రులు బహిరంగంగానే అసహనం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ సోషల్ మీడియా ఇన్చార్జి సైతం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ప్రచా రం జరిగింది. ప్రభుత్వ అసమర్థతను ఎలా కప్పిపుచ్చుకోవాలో, ఎలా కౌంటర్ చేయాలో తెలియక కాంగ్రెస్ సోషల్ మీడియా చేతులెత్తేసినట్టు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా సోషల్ మీడియా వారియర్లను భయపెట్టాలని నిర్ణయించుకున్నట్టు చర్చ జరుగుతున్నది. ఇందులో భాగంగానే కొణ తం దిలీప్‌ను అరెస్ట్ చేశారని అంటున్నారు.
తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్‌ను అరెస్ట్ చేయడం వెనుక మరో కారణం కూడా ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. లగచర్లకు చెందిన బాధితులు సోమవారం ఢిల్లీలో జాతీయ ఎస్టీ, ఎస్టీ కమిషన్లు, మానవ హక్కులు, మహిళా హక్కుల కమిషన్లను కలిశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి వరుసగా అదే సమయానికి మంత్రులతో ప్రెస్‌మీట్ నిర్వహించారు.
వాస్తవానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రెస్మీట్లో కొత్తగా చెప్పిన వివరాలేమీ లేవు. ఆదివారం ప్రభుత్వం ఒక నోట్లో విడుదల చేసిన సర్వే గణాంకాలను చదివి వెళ్లిపోయారు. దీంతోపాటు సోషల్ మీడియా వారియర్ల దృష్టిని మరల్చేందుకు కొణతం దిలీప్‌ను అరెస్ట్ చేశారని విమర్శిస్తున్నారు. తద్వారా ప్రధానమీడియాలో, సోషల్ మీడియాలో చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నమని చెప్తున్నారు.