హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ఇక్రిశాట్ దిగుబడి నాణ్యతను ముందే గుర్తించే ‘లీజీ స్కాన్’ పరికరాన్ని సంస్థ అభివృద్ధి చేసింది. దీని ద్వారా పంట ఉత్పత్తిని కూడా అంచనా వేయొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వాతావరణంలో మార్పులను అంచనా వేసేందుకు కూడా కృత్రిమ మేధను వినియోగిస్తున్నది. దీనిద్వారా వాతావరణ మార్పులకు అనువైన పంటలను ముందే గుర్తించే వీలు కలుగుతుందని పరిశోధకులు తెలిపారు. క్రాప్ ఫిజియాలజీ, మాడలింగ్ క్లస్టర్ విధానం ద్వారా అభివృద్ధి చేసిన జన్యు బ్యాంక్ టెక్నాలజీ పంటలపై నీటి ఎద్దడి, భూసార ప్రభావాన్ని ముందస్తుగా అంచనా వేస్తుందని వివరించారు. ఈ టెక్నాలజీని ఇప్పటికే పలు కంపెనీలు వినియోగిస్తుండగా.. రైతులు, అకడమిక్, రిసెర్చ్ స్కాలర్లకు ఇక్రిశాట్ అందుబాటులో ఉంచింది.
వాతావరణ మార్పులు పంటలపై చూపుతున్న ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఇక్రిశాట్ ఆదిలాబాద్ రైతులతో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించింది. టెక్నికల్ ఇంజినీర్ల బృందంతో కలిసి రైతు సేవాసంఘాలకు సాంకేతికతతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించింది. జొన్నల లక్షణాలను అంచనా వేసి, స్కోరింగ్ ద్వారా గుర్తించేలా శిక్షణ ఇచ్చారు. ఇది జొన్న ఉత్పత్తి 10% పెరిగేలా సాయపడింది. శనగలు, బఠానీ వంగడాలపైనా పరీక్షలు చేసి, అవగాహన కల్పించింది. ఫలితంగా కరువు ఉన్నా, దిగుబడి 25% పెరిగిందని ఇక్రిశాట్ రిసెర్చ్ డిప్యూ టీ జనరల్ అరవింద్ వెల్లడించారు. విత్తనోత్పత్తి, కొత్త, అరుదైన వంగడాల జన్యువుల భద్రతలో కృత్రిమ మేధను వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు.