హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తేతెలంగాణ) : ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలు, రైతులు ఎట్టకేలకు పెద్దపులి భయం వీడారు. వారం రోజులుగా ఉమ్మడి జిల్లాలో తిరుగుతున్నపెద్దపులి ఎట్టకేలకు కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో అడుగుపెట్టింది. తొలుత మహారాష్ట్ర సరిహద్దుకు వంద మీటర్ల దూరంలోని అప్పారావుపేట్ బీట్ పరిధిలో కవ్వాల్ పులుల సంరక్షణ పరిధిలోకి వచ్చే పెంబి అడవుల్లో పెద్దపులి ఆనవాళ్లు కనిపించాయి. దీంతో వెంటనే రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
అధికారులు వెంటనే చేరుకుని పెంబితండా భీమన్న చెరువు ప్రాంతంలో పెద్ద పులి పాదముద్రలు గుర్తించి, ట్రాప్ ఏర్పాట్లు చేసినట్టు ఎఫ్ఆర్వో రమేశ్ వెల్లడించారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం అటవీ ప్రాంతంలో, మహారాష్ట్ర సరిహద్దుకు వంద మీటర్ల దూరంలోని అప్పారావుపేట్ బీట్ పరిధిలో పెద్దపులి ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పర్యవేక్షణ చేపట్టారు. సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్ పెద్దపులి కనబడింది. తాజాగా కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోకి పెద్దపులి వెళ్లినట్టు అధికారులు గుర్తించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.