Professional Colleges | హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రొఫెషనల్ కాలేజీల మూసివేత కొనసాగుతున్నది. ఏడేండ్లల్లో 250కి పైగా కాలేజీలు మూతపడ్డాయి. 2017లో ఇంజినీరింగ్ కాలేజీల సంఖ్య 348 ఉండగా, నిరుటి వరకు వీటి సంఖ్య 273కు చేరింది. మేనేజ్మెంట్ కాలేజీలు గతంలో 393 ఉండగా, ఇప్పుడు 314కు పడిపోయింది. గతంలో 78 ఎంసీఏ కాలేజీలు ఉండగా, ఇప్పుడు 65కి చేరింది. ఇలా పలు ప్రొఫెషనల్ కాలేజీలు మూసివేత దిశగా సాగుతున్నాయి. కాలేజీలు అవసరమా.. లేదా? అని చూడకుండా ఇష్టారీతిన ఇబ్బడి ముబ్బడిగా అనుమతులివ్వడమే ఇందుకు కారణంగా విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
అప్పట్లో ఫీజు రీయింబర్స్మెంట్ ఉండటంతో యాజమాన్యాలు సైతం ఇష్టారీతిన కాలేజీలను ఏర్పాటు చేశారు. తీరా చూస్తే కాలేజీలు అధికంగా ఉండటం, విద్యార్థులు చేరకపోవడం, సీట్లు ఖాళీగా ఉండటంతో మూసివేత దిశగా పయనిస్తున్నాయి. కాగా, కొత్త కాలేజీలు సైతం రాష్ట్రంలో ఏర్పాటవుతున్నాయి. 2017 -18లో 5, 2018 -19లో 11, 2019 -20లో 5, 2020 -21లో 8, 2021 -22లో 9, 2022 -23లో 2 చొప్పున కొత్త కాలేజీలు ఏర్పాటయ్యాయి. మూతబడుతున్న వాటితో పోల్చితే కొత్తగా ఏర్పాటవుతున్నవి నామమాత్రమే కావడం గమనార్హం.