మల్యాల, ఏప్రిల్ 4: టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీపై సిట్ బృందం మంగళవారం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో గ్రూ ప్-1 పరీక్ష రాసిన అభ్యర్థులను ప్రశ్నించింది. తాటిపెల్లితోపాటు ఇతర గ్రామాల్లో సిట్ బృందం దర్యాప్తును కొనసాగించింది. తాటిపెల్లికి చెందిన టీఎస్పీఎస్సీ ఉద్యోగి రాజశేఖర్‌రెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. రాజశేఖర్‌రెడ్డి, తన సొంత మండలం మల్యాలలో గ్రూప్-1తో పాటు, పలు పోటీ పరీక్షలకు హాజరైన ఉద్యోగార్థులకు ప్రశ్నపత్రాలను విక్రయించాడన్న ఆరోపణలు వచ్చాయి. మల్యాల మండలంలోనే వంద మందికి వందకుపైగా మార్కులు వచ్చాయం టూ ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో సిట్ బృందం మల్యాల పరిధిలో దర్యాప్తు చేపట్టింది. సీఐ రవికుమార్ నేతృత్వంలో మండలానికి వచ్చిన ఇద్దరు అధికారులు మండల కేంద్రంతోపాటు పలు గ్రామాలలో దర్యాప్తు చేశారు. గ్రూప్-1 దరఖాస్తులలో అభ్యర్థులు ఇచ్చిన చిరునామాల ఆధారంగా వారి గృహాలకు వెళ్లి ప్రశ్నించారు. డిగ్రీ పాసై ఎన్నాళ్లయింది?, ఇన్నేండ్లు ఏం చేస్తున్నారు? ఏయే వృత్తులు చేశారు? గ్రూప్-1 కోసం ఎక్కడ ప్రిపేర్ అయ్యారు? ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు? వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొందరు అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో వారి తల్లిదండ్రుల సాయంతో వీడియో కాల్ ద్వారా సమాచారం సేకరించారు. నిందితుడు రాజశేఖర్‌రెడ్డితో అభ్యర్థులకు పరిచయం ఉందా? అతడితో ఎప్పుడైనా మాట్లాడారా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేశారు. మొదటిరోజు 20 మందిని కలిసి వివరాలు నమోదు చేశారు.
ఈ సందర్భంగా సీఐ రవికుమార్ మాట్లాడుతూ బుధ, గురువారాల్లో మండలంలోని మిగిలిన గ్రామాల్లో విచారణ జరుపుతామన్నారు. మొదటి రోజు కలిసిన గ్రూప్ 1 అభ్యర్థులు ఉన్నంతలో పూర్తిస్థాయి వివరాలను అందించి దర్యాప్తునకు సహకరించారని చెప్పారు. మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రూప్-1 అభ్యర్థులను కలిసి.. తాము సేకరించిన వివరాలతో నివేదికను రూపొందించి, ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు.
హైదరాబాద్ సిటీబ్యూరో/చంచల్‌గూడ: ఏఈ ప్రశ్నపత్రం కొని పరీక్ష రాసిన ఘటనలో మరో ముగ్గురిని సిట్ అధికారులు మంగళవారం చంచల్‌గూడ జైలు నుంచి తమ కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో అరెస్టయిన 15 మంది నిందితుల్లో ప్రశాంత్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, తిరుపతయ్యలను తాజాగా కస్టడీలోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులు ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి ఏఈ పేపర్‌ను రేణుక, ఆమె భర్త డాక్యాకు విక్రయించగా, రేణుక సోదరుడు రాజేశ్వర్ (సర్పంచ్ కొడుకు), తిరుపతయ్య ద్వారా ప్రశాంత్, రాజేందర్‌కు ఏఈ పేపర్‌ను విక్రయించారు. ఈ ముగ్గురి నుంచి ఇంకెవరికైనా పేపర్ వెళ్లిందా? వెలుగులోకి రాని అంశాలేమైనా ఉన్నాయా? అనే విషయాలపై ప్రశ్నిస్తున్నారు. నిందితులు ముగ్గురిని చంచల్‌గూడ జైలు నుంచి హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు.