హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కొత్త జిల్లాలకు అనుగుణంగా కోర్టుల సముదాయాల నిర్మాణానికి కృషి చేస్తున్నట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ హైకోర్టు ‘న్యాయ నిర్మాణ్ ’ డాక్యుమెంట్ను ప్రకటించిందన్నారు. హైకోర్టు మొదటి కోర్టులో జరిగే విచారణ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించామని, త్వరలో హైకోర్టులోని మిగిలిన కోర్టుల్లోనూ విచారణను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని వెల్లడించారు. 74వ గణతంత్ర వేడుకల సందర్భంగా గురువారం హైకోర్టులో సీజే జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా కోర్టుల సముదాయాల నిర్మాణాలు, కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనకు న్యాయ నిర్మాణ్లో నిర్దేశించిన మేరకు అమలు చేస్తామని చెప్పారు. 2, 4, 10 కోర్టుల సముదాయాల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించామన్నారు. జిల్లా కోర్టుల సముదాయాలకు ప్రభుత్వం 5 నుంచి 20 ఎకరాల చొప్పున భూమి కేటాయించిందని చెప్పారు. వీటితోపాటు ఫ్యామిలీ కోర్టులు, పోక్సో కోర్టులను విడివిడిగా నిర్మించనున్నట్టు తెలిపారు. 12 మంది జిల్లా జడ్జీల నియామక ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. తొలిసారిగా 2023 ఏడాదికి ఉద్యోగాల నియామక క్యాలెండర్ను ప్రకటించినట్టు వెల్లడించారు. వివిధ క్యాటగిరీలకు చెందిన 592 పోస్టులను భర్తీ చేశామని వివరించారు. హైకోర్టులో 779 అదనపు పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. జడ్జీలకు వ్యక్తిగత కార్యదర్శుల పోస్టులు 77, టైపిస్ట్ పోస్టులు 84 భర్తీ చేశామన్నారు.
న్యాయ సేవాధికార సంస్థ ద్వారా రాష్ట్రంలో 11,697 మందికి న్యాయ సహా యం అందించామని, తద్వారా రూ.52.5 కోట్ల పరిహారం అందేలా చూశామని సీజే తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా 17,23,786 కేసులను పరిష్కరించినట్టు వివరించారు. రాజ్యాంగం అమల్లో న్యాయవ్యవస్థది కీలక పాత్ర అని అన్నారు. కోర్టుల్లో పెండింగ్ కేసుల సత్వర పరిషారం కోసం బార్ అండ్ బెంచ్ చేస్తున్న కృషిని కొనియాడారు. అనంతరం ఏజీ బీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. బీఆర్ అంబేదర్ పేరును ప్రభుత్వం సచివాలయానికి పెట్టిందని తెలిపారు. అంతకు ముందు హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వీ రఘనాథ్, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి ప్రసంగించారు. యామినీరెడ్డి నేతృత్వంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.