హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అనుసరిస్తున్న విత్తన పరీక్ష విధానంపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటుచేసిన టిస్టా విత్తన ల్యాబ్ అద్భుతంగా ఉన్నదని, ఇలాంటి ల్యాబ్‌ల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు చేరుతాయని మెచ్చుకున్నది. కేంద్ర విత్తన పరీక్ష ల్యాబ్ (ఎన్ఎస్ఆర్టీసీ)తోపాటు రాష్ర్టాల్లోని ల్యాబ్‌లను అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే బుధవారం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తల బృందం తెలంగాణ విత్తన పరీక్ష కేంద్రాన్ని (టిస్టా) సందర్శించింది. ల్యాబ్ పనితీరుపై అధ్యయనం చేసింది.
ఈ సందర్భంగా కమిటీ సభ్యుడైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీడ్ సైన్స్ డైరెక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ.. టిస్టా దేశానికి విత్తన పరిజ్ఞానం అందించేందుకు నోడల్ ఏజెన్సీగా నిలుస్తుందని చెప్పారు. అనంతరం సచివాలయంలో కేంద్ర బృందం వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో భేటీ అయింది. విత్తన ల్యాబ్‌తో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందిస్తున్నామని మంత్రి చెప్పారు. సమావేశంలో వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హన్మంతు, ఇస్టా అధ్యక్షుడు కేశవులు, ప్రొఫెసర్ భాస్కరన్, కేంద్ర వ్యవసాయశాఖ డిప్యూటీ కమిషనర్ దిలీప్‌కుమార్ శ్రీవాస్తవ, దక్షిణాసియా వరి పరిశోధన కేంద్రం డైరెక్టర్ సుదాన్షుసింగ్, ఎన్ఎస్ఆర్టీసీ విత్తన శాస్త్రవేత్త ఎంపీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.