రాయపర్తి, మే 2: రైతు వ్యతిరేక విధానాలతో ముందుకు సాగుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రైతుల ఉసురు తప్పక తగులుతుందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని మహబూబ్‌నగర్, కొండాపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల చేతిలో బందీగా మారిందని ఆరోపించారు. దేశంలోని ప్రజలందరి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్న పన్నులను అంబానీ, అదానీలకు కట్టబెడుతూ మతతత్వ రాజకీయాలకు తెరలేపుతున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి క్రమంగా పెరుగుతున్న విధానాలను గమనిస్తున్న కేంద్రం రాష్ట్రంలోని రైతాంగం నడ్డి విరవాలన్న దురుద్ద్దేశంతోనే యాసంగి ధాన్యం కొనేందుకు విముఖత చూపిందని ఆరోపించారు. కేంద్రం పట్టించుకోకున్నా రాష్ట్రంలోని రైతులు నష్టపోవద్దన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారని స్పష్టంచేశారు.