హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పెద్ద చిక్కు వచ్చిపడింది. పరీక్ష రాయడానికి బదులు.. పరీక్ష కేంద్రానికి వెళ్లడమే పెద్ద పరీక్షలా మారింది. పరీక్షను రాసేందుకు రాష్ట్ర సరిహద్దు నుంచి మరో రాష్ట్ర సరిహద్దుకు ప్రయాణించాల్సి వస్తున్నది. కొందరు అభ్యర్థులైతే 500 కి.మీ, 450 కి.మీ ప్రయాణించాల్సి రావడం గమనార్హం. టెట్ హాల్‌టికెట్లు శనివారం విడుదలయ్యాయి. అధికారులు అభ్యర్థుల హాల్‌టికెట్లను వెబ్సైట్లో పొందుపరిచారు. 2026 జనవరి 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరుగనున్నాయి. హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను చూసి నివ్వెరపోవాల్సి వచ్చింది.
ఆదిలాబాద్ అంటే దాదాపు మహారాష్ట్ర బార్డర్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అంటే అటూ ఏపీ, ఇటూ ఛత్తీస్‌గఢ్ బార్డర్. టెట్ పరీక్ష కోసం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థులకు పాల్వంచలో సెంటర్ వేశారు. వందల కొద్ది అభ్యర్థులకు ఇలా ఇష్టారాజ్యంగా సెంటర్లు వేశారు. అధికారుల తీరుపై అభ్యర్థులు, టీచర్ సంఘాలు మండిపడుతున్నాయి. మూడు గంటల పరీక్ష కోసం మూడు రోజులు సెలవులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నదని టీచర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అసలే చలి వణికిస్తున్నది.. ఈ చలిలో అంతంత దూరం ప్రయాణించి పరీక్ష రాయడమే ఇబ్బందిగా మారనున్నదని పేర్కొంటున్నారు. సెంటర్లను ఏ ప్రాతిపదికన కేటాయించారని టీఎస్ యూటీఎఫ్ ప్రశ్నించింది. టీచర్లకు ఆన్‌డ్యూటీ కల్పించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి వెంకట్ డిమాండ్ చేశారు.
చివరి వారికి హైదరాబాద్‌లో..
టెట్ సెంటర్లను పద్ధతి ప్రకారం కేటాయించలేదని టీచర్ సంఘాలు అంటున్నాయి. ముందుగా దరఖాస్తు చేసిన వారికి సుదూర ప్రాంతాల్లో వేశారని అంటున్నాయి. కొన్ని ఉదాహరణలు ముందుంచుతున్నాయి. ఓ అభ్యర్థి టెట్ దరఖాస్తులు ప్రారంభమైన రోజే దరఖాస్తు చేశాడు. కానీ సదరు టీచర్‌కు సుదూరంగా ఖమ్మం జిల్లా పాల్వంచలో సెంటర్ వేశారట. ఓ అభ్యర్థి చివరి రోజు పేపర్-2కు దరఖాస్తు చేయగా హైదరాబాద్‌లో సెంటర్ వేశారట. మరో అభ్యర్థి దరఖాస్తులు ప్రారంభమైన మూడో రోజు దరఖాస్తు చేశాడు. ఆ అభ్యర్థి 15వ ఆప్షన్ ఎంచుకున్న చోట అది కూడా 450 కి.మీ దూరంలో సెంటర్ వేశారని అంటున్నారు. ఇలా అనేక మందికి జరిగినట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన మెజారిటీ టీచర్లకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి, కొత్తగూడెంలో సెంటర్లు వేసినట్టు ఆరోపిస్తున్నారు.
లోపభూయిష్టంగా సెంటర్ల కేటాయింపు: ఎస్టీయూ టీఎస్
టెట్ పరీక్ష కేంద్రాల కేటాయింపు లోపభూయిష్టంగా ఉందని ఎస్టీయూ టీఎస్ అభ్యంతరం వ్యక్తంచేసింది. సుదూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించడంతో టీచర్లు అవస్థలు పడుతున్నారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని టీచర్లకు ఖమ్మం జిల్లాలో సెంటర్లు కేటాయించడం అన్యాయమని వాపోయారు. ఈ సారి వేలాది మంది ఇన్‌సర్వీస్ టీచర్లు టెట్ పరీక్ష రాయబోతున్నారని, టీచర్ల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని, సమీపంలోనే సెంటర్లు కేటాయించాలని, టెట్ రాసే టీచర్లకు ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
సమీపంలో సెంటర్లు వేయలేరా..?: తపస్
వందల కి.మీ దూరంలో టెట్ సెంటర్లు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ప్రకటించింది. టీచర్లు, అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపింది. సెంటర్లు మార్చాలి లేదా టీచర్లకు ఆన్‌డ్యూటీ కల్పించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ డిమాండ్ చేశారు. ఎప్‌సెట్ పరీక్షలో సెంటర్లను జోన్లుగా విభజించి అదే జోన్‌లోని అభ్యర్థులకు సెంటర్లు వేస్తున్నారని, విద్యాశాఖ ఇలా ఎందుకు చేయడం లేదో అర్థం కావడంలేదని వాపోయారు.
ఎంత ఘోరమంటే..