హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులైనా ఏ ఒక్కటీ సంపూర్ణంగా నెరవేర్చకపోవడంతో సెప్టెంబర్2 నుంచి 8 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ నేతలు తమ తమ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటుచేస్తున్నారు. ఆదివారం నల్లగొండ, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ వంచనను ప్రజలకు వివరించాలి
కాంగ్రెస్ ప్రభుత్వ దగాను, వంచనను ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ పోరుబాట చేపట్టిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో జరిగిన సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2 నుంచి 8వరకు అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 3న మిర్యాలగూడకు కేటీఆర్ రాకపై ఆదివారం కంచర్ల క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో వారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బండ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనా వైఫల్యంపై ప్రజలకు పూర్తిగా అర్థమైందని, కేసీఆర్ నాయకత్వంలోనే సంక్షేమం, అభివృద్ధి జరిగాయనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గంలో నిర్వహించే వారం రోజుల కార్యాచరణలో బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పోరుబాటకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాసమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, 420 హామీలు అమలుచేస్తామని చెప్పి మోసగించిందని తెలిపారు.
కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ దుర్మార్గపు పాలనతో ప్రజలు విసిగిపోయారని తెలిపారు. రాష్ట్రంలో దోపిడీ, బ్లాక్‌మెయిలర్ పాలన సాగుతున్నదని, ఈ విషయాన్ని పోరుబాటలో ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, గ్యారెంటీలపై ప్రజలకు వివరించాలని సూచించారు.

కేటీఆర్ రాకకు నల్లగొండలో ఏర్పాట్లు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు, శ్రేణులంతా బీఆర్ఎస్ పోరుబాటకు సన్నద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 3న రైతాంగ సమస్యలపై మిర్యాలగూడలో నిర్వహించే రైతు రణభేరికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రైతు రణభేరి ఏర్పాట్లను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యవేక్షించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువతోపాటు ఏఎంఆర్పీ, వరద కాలువలకు సైతం సాగునీటిని విడుదల చేయాలన్న ప్రధాన డిమాండ్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా రైతులు, రైతు కూలీల సమస్యలు, వ్యవసాయరంగ సంక్షోభంపై కేటీఆర్ ఫోకస్ చేయనున్నారు. కరెంటు కోతలు, యూరియా యాప్ కష్టాలు, రైతుబీమా, బోనస్ ఎగవేత, పంటల బీమా తదితర అంశాలపై కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగట్టనున్నారు.