బడంగ్పేట్, మే 14: పెండ్లి ఊరేగింపులో బరాత్ తీయలేదని అలక వ హించిన వధువు ఎటో వెళ్లిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని అల్మాస్‌గూడలో బుధవారం జరిగింది. దండుమైలారానికి చెందిన అబ్బాయికి అల్మాస్‌గూడకు చెందిన ఓ అమ్మాయితో వివాహం జరిగింది. విందు ముగిసిన అనంతరం వధూవరులిద్దరూ కారులో దండుమైలారం బయలుదేరారు.
వారి వెనకాల బస్సులో బంధువులు అనుసరించారు. కానీ కారు ముందు బ్యాండ్ బాజా మోగకపోవడంతో బరాత్ ఏమైందని వధువు ప్రశ్నించింది. దండు మైలారం చేరుకోవడానికి చాలా రాత్రి అవుతుంది గనుక బరాత్ తీయడం లేదని వరుడు, అతని బంధువులు చెప్పారు. దీంతో అలక వ హించిన వధువు కారు బడంగ్పేట్ గాంధీనగర్ బస్‌స్టాప్ వద్దకు చేరుకోగానే వరుడిని, అతడి అక్కని గాయపరిచి బయటికి దూకి పారిపోయింది. ఈ హఠాత్పరిణామానికి అందరూ అవాక్కయ్యారు.