Bear in Suryapet | సూర్యాపేట టౌన్, మే 14 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం ఎలుగుబంటి ప్రత్యక్షం కావడంతో పట్టణ వాసులు ఉలిక్కి పడ్డారు. పట్టణంలోని డీ మార్ట్ వెనుక సందులో కొత్తగా నిర్మిసున్న ఇంట్లో ఓ మూలన కనిపించడంతో యజమాని చూసి చుట్టుపక్కల వారికి, సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఫారెస్ట్, పోలీస్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పెద్దఎత్తున అక్కడికి చేరుకుని దాన్ని పట్టుకునేందుకు ఆపరేషన్ ప్రారంభించారు. వందల మంది గుమికూడటంతో వారి అరుపులు, అధికారుల కదలికలను గమనించిన ఎలుగుబంటి ఒక్కసారిగా బయటకు రావడంతో అంతా పరుగులు తీశారు.
అక్కడి నుంచి సుమారు 200 మీటర్ల దూరంలో నిర్మాణంలో ఉన్న మరో ఇంట్లోకి ఆ ఎలుగుబంటి దూరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ఇంటిని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ఇంటి చుట్టూ తడకలు, గ్రిల్స్‌తో బయటకు వెళ్లకుండా ఏర్పాట్లు చేశారు. అనంతరం సుమారు ఆరు గంటలు శ్రమించిన రెస్క్యూ టీమ్ వలలతో బంధించి మత్తు ఇంజిక్షన్లు ఇచ్చి ఫారెస్ట్ వాహనంలోకి ఎక్కించారు. ఆ ఎలుగుబంటి సుమారు 110 కిలోలు ఉన్నదని, అందుకే దాన్ని పట్టుకునేందుకు 6 గంటలకు పైగా పట్టిందని సంబంధిత అధికారులు తెలిపారు.
నెల రోజుల క్రితం అర్వపల్లి మండల కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచరించినట్లు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకునే లోపే ఆ ఎలుగుబంటి పరారైంది. అలా పరారైన ఎలుగుబంటి అది ఇదే కావచ్చునని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ఎలుగుబంటిని వరంగల్ జూకు పంపి మూడ్రోజుల పాటు పరీక్షలు నిర్వహించి ఉన్నతాధికారుల సూచనల మేరకు అటవీ ప్రాంతానికి తరలిస్తామని తెలిపారు.
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి.. సూర్యాపేట పట్టణంలో ఎలుగుబంటి సంచరిస్తుందన్న విషయం తెలియగానే హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఎలుగుబంటి దూరిన నివాసానికి వెళ్లి సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. మరో వైపు ప్రజలు అందోళన చెందకుండా ధైర్యం చెప్తూ రెండు గంటలపాటు అక్కడే గడిపారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో డీఎఫ్ఓ సతీశ్‌కుమార్, డాక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎఫ్ఆర్ఓ అఫీజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.