నాంపల్లి కోర్టులు, మే 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ బెయిల్పై మంగళవారం ఇన్చార్జి కోర్టు 7వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట వాదనలు ముగిశాయి. షరతులతో బెయిల్ మంజూరు చేయాలని, నిందితుడికి ఐపీసీ సెక్షన్ 468 వర్తించదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఎలాంటి ఫోర్జరీ జరుగకుండానే ఐపీసీ సెక్షన్ 468ను పెట్టారని తెలిపారు.
ఇటీవల అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసులో కాంగ్రెస్ సోషల్మీడియా ప్రతినిధులపై నమోదైందని, వారిని అరెస్టు చేయరాదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, ఉత్తర్వు ఈ కేసుకు కూడా వర్తిస్తుందని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కీలకదశలో ఉన్న తరుణంలో బీఆర్ఎస్ సోషల్ మీడియాకు వెన్నెముకగా ఉన్న క్రిశాంక్ సేవలు ముఖ్యమని, బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు.
నిరుడు ఓయూ ఇచ్చిన నోటీసు, ఇటీవల జారీచేసిన సెలవు నోటీసుకు మధ్య వ్యత్యాసం గురించి పోలీసులు విచారణ చేపట్టకుండా కేసును నమోదు చేశారని తెలిపారు. విద్యుత్తు, నీటి కొరత ఉన్నదన్న విషయాన్ని తప్పుపట్టడంలో అర్థంలేదని, రాజకీయాలను అడ్డంపెట్టుకుని సీఎం రేవంత్రెడ్డి ప్రత్యర్థి పార్టీకి చెందిన వారిపై కేసులు నమోదు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలను విన్న కోర్టు బుధవారానికి తీర్పును రిజర్వు చేసింది.