నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ప్రారంభించిన కలెక్టర్, సీపీ.. సరికొత్త వాహనాలు, సందర్శకులతో కిటకిట నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో ఆటో షో అట్టహాసంగా జరుగుతున్నది. మార్కెట్లోని సరికొత్త వాహన శ్రేణిని ఒక్కచోటనే చూసేందుకు అంతా భారీ సంఖ్యలో వస్తున్నారు. ఆయా కంపెనీల డీలర్లు, బ్యాంకింగ్ సంస్థల ప్రతినిధులు పాల్గొంటుండటంతో నయా మోడల్స్ ఫీచర్లు, ధరలు తెలుసుకొని.. లోన్లు, ఈఎంఐల వివరాలను కనుక్కొంటున్నారు.
నిజామాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ నగరంలో ఆటో షో అట్టహాసంగా ప్రారంభమైంది. పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ షోకు ప్రముఖులు, వాహన ప్రియులు పెద్ద ఎత్తున వచ్చారు. జిల్లా కలెక్టర్ సీ నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ వెంకటరమణ, ఎస్బీఐ డీజీఎం ప్రఫుల్లకుమార్ జెనా, నమస్తే తెలంగాణ ప్రకటనల విభాగం జనరల్ మేనేజర్ సురేందర్ రావు పాల్గొన్నారు. కలెక్టర్ నారాయణ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి షోను ప్రారంభించారు.
అనంతరం ఆటో షోలోని స్టాళ్లను పరిశీలించిన అతిథులు.. ఆయా వాహనాల ఫీచర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, సీపీలు సరదాగా రాయల్ ఎన్ఫీల్డ్ బైకులపై సవారీ చేయడం అందరినీ ఆకట్టుకున్నది. ఇక బ్యాంకర్లు సైతం అందుబాటులో ఉండటంతో రుణాలకు సంబంధించిన వివరాలను కొనుగోలుదారులు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారీగా తరలివచ్చిన సందర్శకులు.. బ్యాంక్ ప్రతినిధులు, ఆటోమొబైల్ కంపెనీల డీలర్ల మధ్య సంప్రదింపులు జోరుగా సాగుతున్నాయి. బుకింగ్స్ కూడా అంతేస్థాయిలో అవుతున్నాయి.
కార్యక్రమంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, ఏసీపీలు వెంకటేశ్వర్లు, కిరణ్, ప్రభాకర్‌లతోపాటు నమస్తే తెలంగాణ యూనిట్ మేనేజర్ గడ్డి ధర్మరాజు, బ్యూరో చీఫ్ జూపల్లి రమేశ్, ఎడిషన్ ఇన్చార్జి లక్మ రమేశ్, ప్రకటనల విభాగం ఏజీఎం రాజిరెడ్డి, మేనేజర్ శ్రీకాంత్, సర్క్యూలేషన్ ఏసీఎం సునీల్ తదితరులు పాల్గొన్నారు.
కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఏర్పాటు చేసిన ఈ ఆటో షో చక్కని వేదికగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణ రెడ్డి కొనియాడారు. నిజామాబాద్ వంటి నగరాల్లో ఇంత భారీ ఏర్పాట్లతో వాహన ప్రదర్శన ఏర్పాటు చేయడం చాలా బాగుందన్నారు. సీపీ నాగరాజు మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో ఈ స్థాయిలో ఆటో షో వంటి కార్యక్రమాలు చేపట్టడం ఆహ్వానించదగ్గ పరిణామంగా అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నిజామాబాద్‌లోనే బడా కంపెనీల వాహనాలను కొనుగోలు చేసే అవకాశం వచ్చిందన్నారు. దీనివల్ల ప్రజలకు దూర భారం, రవాణా ఖర్చులు తప్పాయన్నారు. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందులో స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఆదివారంతో ఈ షో ముగియనున్నది.
ఆటోషోకు వస్తున్న స్పందన భేష్ అని నమస్తే తెలంగాణ ప్రకటనల విభాగం జీఎం ఎన్ సురేందర్‌రావు ఆనందం వ్యక్తంచేశారు. సగటు వాహనదారుడి ఆలోచనలకు తగినట్టుగా వాహనాన్ని కొనుగోలు చేయాలంటే రోజులు పడుతుందని, ముఖ్యంగా నిజామాబాద్ వంటి నగరాల్లో ఆటో సంస్థలు, వనరులు స్వల్పమని పేర్కొన్నారు. అందుకే నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో పేరొందిన ఆటోమొబైల్ కంపెనీలను ఒక్కచోటికి చేర్చి ఈ ఆటో షోను నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ఏడాది తొలి ఎడిషన్ దిగ్విజయమైందన్న ఆయన.. అదే స్ఫూర్తితో రెండో ఎడిషన్‌ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈసారి 22 స్టాల్స్ ఏర్పాటుకావడం శుభ పరిణామంగా పేర్కొన్నారు. ఈ ఆటో షో నిజామాబాద్ వాసులకు ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.