భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 9: అప్పుల బాధలు భరించలేక మరో ఆటోడ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో జరిగింది. స్థానిక బీసీ కాలనీకి చెందిన రావుల నగేశ్ (32) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఆటోకు సరిగ్గా గిరాకీ లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఆటో ఫైనాన్స్ కిస్తీలు కట్టలేకపోతున్నాడు. అలాగే సమభావన సంఘంలో తన భార్య తీసుకున్న రుణం బకాయి చెల్లించడం లేదు. ఇలా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ.. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించపోవడంతో మనస్తాపం చెందాడు.
రోజు మాదిరిగా సోమవారం ఆటో తీసుకుని ఇంటి నుంచి బయల్దేరాడు. పోచంపల్లి నుంచి కొత్తగూడెం వెళ్లే దారిలో పిలాయిపల్లి కాల్వ సమీపంలో అటవీ ప్రాంతానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. గమనించిన గ్రామస్థులు నగేశ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి వెళ్లి చూసేసరికి చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. మృతుడి భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని భువనగిరి దవాఖానకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని ఎస్సై భాస్కర్‌రెడ్డి తెలిపారు.