హిమాయత్‌నగర్, జనవరి 13 : పౌరహక్కులు, ప్రజల స్వేచ్ఛను ఏపీలోని కూటమి ప్రభుత్వం హరిస్తున్నదని పౌర హక్కుల సీనియర్ నేత ప్రొఫెసర్ హరగోపాల్ మండిపడ్డారు. పౌర హక్కుల సంఘం నేత క్రాంతి చైతన్యతోపాటు ఆరుగురు సంఘం నేతలపై మోపిన దేశద్రోహం కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
మంగళవారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు కలిసి ఆయన మాట్లాడారు. తిరుపతి పట్టణంలో పౌర హక్కుల సంఘం 20వ రాష్ట్ర మహాసభలను నిలుపుదల చేసేందుకు కుట్ర పూరితంగా బ్యానర్లను తొలగించడమే కాకుండా కేసులు నమోదు చేసి, సంఘం నేతలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.