Telangana Budget | హైదరాబాద్, ఫిబ్రవరి 10(నమస్తే తెలంగాణ): తమది ప్రజా ప్రభుత్వమని పదేపదే గొప్పలు చెబుతున్న రాష్ట్ర సర్కారు పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు మాత్రం అరకొర నిధులు కేటాయించింది. ప్రజాపాలన ద్వారా ఇండ్ల కోసం 82 లక్షల దరఖాస్తులు వస్తే వాటిలో నాలుగు లక్షల ఇండ్లను మాత్రమే ఈ ఏడాది నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. శనివారం ప్రవేశపెట్టిన 2024-25 తాత్కాలిక బడ్జెట్లో 4 లక్షలకుపైగా ఇండ్ల నిర్మాణానికి రూ.7,740 కోట్లు కేటాయించింది. దీనికి కేంద్ర సాయం కలుపుకొన్నా నిర్ధారిత లక్ష్యం చేరుకోవాలంటే మాత్రం మరో రూ.8 వేల కోట్లు అవసరం.
నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల్లో 4,16,500 ఇండ్లను నిర్మించనున్నట్టు బడ్జెట్లో ప్రకటించారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం ఒక్కో ఇంటికి రూ. ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాల్సి ఉంది. ఈ లెక్కన 4.16 లక్షల ఇండ్ల నిర్మాణానికి రూ. 20,825కోట్లు అవసరమవుతాయి. బడ్జెట్లో గృహనిర్మాణానికి కేటాయించింది కేవలం రూ. 7,740కోట్లు. అంటే, రూ. 13వేల కోట్ల పైచిలుకు లోటు ఉన్నట్టే. ఈ లోటును ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నుంచి రాబడతామని చెప్పినప్పటికీ ఈడబ్ల్యూఎస్ పథకం కింద కేంద్రం ఒక్కో యూనిట్‌కు గరిష్ఠంగా రూ.1.5 లక్షలు మాత్రమే సాయం అందిస్తున్నది. ఈ లెక్కన చూసుకున్నా 4.16 లక్షల ఇండ్లకు రూ. 6.2 కోట్ల మాత్రమే వచ్చే అవకాశముంది. అంటే ఇంకా రూ.7-8 వేల కోట్ల వరకు లోటు ఉన్నట్టే.
ఆరు గ్యారెంటీల హామీకి మొత్తం 1,25,84,383 దరఖాస్తులు రాగా, వాటిలో ఇందిరమ్మ ఇండ్లకు 82,82,332 దరఖాస్తులొచ్చాయి. వీటిలో పావువంతుమంది అర్హులను గుర్తించినా దాదాపు 20 లక్షల మందికి ఇండ్లు నిర్మించాల్సి ఉంటుంది. బడ్జెట్లో మాత్రం నాలుగు లక్షల ఇండ్లు మాత్రమే నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ లెక్కన 20 లక్షల మందికి ఇండ్లు నిర్మించాలంటే ఐదేండ్లు పడుతుంది. అంతకంటేముందు అర్హులు ఎంతమంది అన్నది తేలాల్సి ఉంటుంది. అర్హులను వీలైనంతగా తగ్గించేందుకు రేషన్‌కార్డు, ఆదాయ ధ్రువీకరణ, ఆస్తులు, నెల సంపాదన, కారు, బైక్ వంటివాటితో లింకుపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.