జయశంకర్ భూపాలపల్లి, జనవరి 30 (నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం (సరస్వతి) బరాజ్‌లో నీటి నిల్వ.. ఇన్వెస్టిగేషన్ పనులకు ఆటంకంగా మారింది. బరాజ్‌లోని నీటిని బయటికి పంపితేనే ఏజెన్సీ సంస్థ పార్సన్ ఇన్వెస్టిగేషన్ పనులను ప్రారంభించనున్నది. అన్నారం బరాజ్‌లోని నీటిని బయటికి పంపితే దిగువన ఉన్న మేడిగడ్డ బరాజ్ వద్ద జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ పనులు నిలిచిపోయే అవకాశం ఉన్నది. మేడిగడ్డ బరాజ్ వద్ద 6, 7వ బ్లాకుల వద్ద ఏజెన్సీ సంస్థలు డైనాసర్, హట్సన్ సంస్థలు ఇన్వెస్టిగేషన్ పనులను కొనసాగిస్తూనే ఉన్నాయి.
అక్కడ ఇన్వెస్టిగేషన్ పనులు త్వరతగతిన పూర్తి చేసి కరకట్ట నిర్మాణం జరిపితే అన్నారం బరాజ్‌లోని నీటిని బయటికి పంపనున్నారు. దీంతో అన్నారం బరాజ్‌లో ఇన్వెస్టిగేషన్ పనులకు లైన్ క్లియర్ కానున్నది. మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్ పనుల్లో జాప్యం అన్నారం బరాజ్‌కు శాపంగా మారింది. మూడు నెలలుగా ఏజెన్సీ సంస్థలు విచారణ పేరుతో జాప్యం చేస్తూనే ఉన్నాయి. అన్నారం బరాజ్‌లో 38,28 ఔట్లెట్స్ వద్ద ఏర్పడిన సీపేజ్‌లకు ఇప్పటికే గ్రౌటింగ్ పూర్తిచేశారు. ప్రస్తుతం బరాజ్‌లో 2.75 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఈ నీటిని బయటికి వదిలితే పార్సన్ సంస్థ బరాజ్‌లో ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా అనే విషయమై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించనున్నది.