శ్రీ కాళేశ్వర పాదమున్ దడిపి లక్ష్మీభారతీ పార్వతీ ప్రాకట్యంపు బరాజులన్ గదలి, ఎల్లంపల్లి మేడారపున్ వాక ల్దాకుచు పొంగి, రామడుగు పంపౌజున్ కళన్నింపి, వాణీ కారుణ్యము వోలె పారి, మరి మానేరున్ భళీ చేరి, బల్వీకన్ మల్లన సాగరమ్ము గనుచున్ శ్రీ కొండ పోచమ్మ గొప్పౌ కొప్పంది, సుచంద్ర శేఖర ధరా పర్వము గల్పించె, గోదా కూలంకష పెక్కుభంగులు ప్రభుత్వ శ్రీల అభ్యున్నతుల్
-డాక్టర్ జీఎం రామశర్మ (శతావధాని)
ఒక సంకల్పం.. ఒక పూనిక.. ఒక తాత్వికత.. అన్నీ కలగలిస్తే అది కాళేశ్వరం. ఒక ఆర్తి, ఒక ఆశ, ఒక స్వప్నం.. అనే వాటికి రూపమొస్తే అది కాళేశ్వరం. నీటికోసం తండ్లాడిన తెలంగాణకు, ఆ నీరు లేక పేదరికంలో మగ్గిన తెలంగాణకు.. కేసీఆర్ అనే రూపంలో కాలమిచ్చిన పరిష్కారం కాళేశ్వరం అనే గంగావతరణం! తెలంగాణ అడుగడుగూ తడిమి చూసిన నేత, తపన ఉన్న నేత కేసీఆర్. సమస్య ఏమిటో విరుగుడు ఏమిటో తెలిసిన నేత కేసీఆర్. ఆయన జరిపిన అనేక గంటల మేధోయజ్ఞంనుంచి ఆవిర్భవించిన అమృతభాండం కాళేశ్వరం!
కేసీఆర్ అపరభగీరథుడై తలపెట్టిన ఈ తపస్సుకు ఎన్ని ఆటంకాలు? ఎన్ని నీలాపనిందలు? ఎన్ని కుట్రలు? రైతులను రెచ్చగొట్టారు! ఆందోళనలు చేయించారు! చచ్చిన వారి పేర్లతో కేసులు వేయించారు! కోర్టుల చుట్టూ తిప్పించారు! కేంద్ర సంస్థలపై ఒత్తిడి తెచ్చారు! సంకల్పం గొప్పదైతే తలపెట్టిన కార్యానికి విఘ్నం ఉండదు. అదే కాళేశ్వరం విషయంలో నిజమైంది. ప్రాజెక్టులంటే దశాబ్దాల కాలహరణం అనే అనుభవం ఉన్నచోట.. ఆగమేఘాల మీద ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసుకోగా లిప్టులనుంచి గోదావరి నీరు ఎగజిమ్మిన సుందర, సుజల స్వప్నాన్ని తెలంగాణ కండ్లనిండా.. కరువుతీరా వీక్షించింది. నెర్రెలు వారిన భూములు హరిత వనాలుగా మారిపోతున్న అద్భుతం అనుభవంలోకి వచ్చింది. జిల్లా తర్వాత జిల్లా.. రిజర్వాయర్ తర్వాత రిజర్వాయర్.. ఒక్కొక్కటీ నిండుతూ ఉంటే ; ఎగిసిపడే గోదావరి జలహోరులో రైతాంగం బంగారు భవితను చూసుకుంది.
70 ఏండ్లపాటు రైతును రాచిరంపాన పెట్టిన వాళ్లు, ఇండ్ల తలుపులు పీక్కు పోయిన వాళ్లు, పురుగుల మందుల బలవన్మరణాల పాలు చేసిన వాళ్లు..దశాబ్దాల పాటు ప్రాజెక్టులు పూర్తి చేయలేని వాళ్లు.. కండ్లముందే ఆగమేఘాల మీద కాళేశ్వరం కడితే హర్షిస్తారా? భరిస్తారా? ఒక్కో లిప్టునుంచి నీళ్లు ఎగజిమ్ముతుంటే గుండెలు జారిపోయి, తమకిక భవిష్యత్తు ఉండదని వెయ్యి గొంతుకలేసుకొని, లక్ష అబద్ధాలు కల్పించి విషప్రచారాలు చేశారు. నీలాపనిందలు వేశారు. ఇంజినీరింగ్ తప్పిదమన్నారు. కమీషన్లు అన్నారు. ఖర్చు పెరిగిందన్నారు. ప్రాజెక్టు వృథా అన్నారు. ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశారు. కానీ కాలం.. అన్నింటికీ సమాధానం చెప్తుంది. అడ్డంకులన్నీ తాత్కాలికమే. ఆకాశంలో కమ్ముకున్న ముబ్బులు చెదిరిపోయినట్టు విషప్రచారాలన్నీ పటాపంచలై కాలపరీక్షలో కాళేశ్వరం గెలిచి నిలుస్తుంది. తెలంగాణ జీవధారగా శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఎందుకంటే.. కేసీఆర్ సంకల్పంలో ఆ బలం ఉంది! తెలంగాణ జాతకంలో ఆ యోగం ఉంది!!
నేటితో కాళేశ్వర జలభాండానికి ఆరేండ్లు పూర్తి. తెలంగాణ జనావళికి వార్షికోత్సవ శుభాకాంక్షలు.
సమయంతో పోటీపడి నిర్మాణం.. నదినే ఎత్తిపోసిన జలయజ్ఞం.. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం..
‘లిఫ్టింగ్ ఏ రివర్’
– డిస్కవరీ చానల్ (5.06.2021)
కాళేశ్వరం ఓ అద్భుత ఇంజినీరింగ్ సాహసం. అమెరికాలోని కొలరాడో ఎత్తిపోతల ప్రాజెక్టు, ఈజిప్టు గ్రేట్ మ్యాన్‌మేడ్ రివర్ ప్రాజెక్టులను తలదన్నేలా దీన్ని నిర్మించారు గ్రోక్ (06.06.2025)
మా గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ప్రాజెక్టు పనులకు నిధులను సమర్థవంతంగా ఖర్చు చేసిన కాళేశ్వరం కార్పొరేషన్‌కు ‘ఏ’ గ్రేడ్.
– రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (10.01.2022)
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కాళేశ్వరాన్ని తెలంగాణలో నిర్మించారు. దీనివల్ల కొన్ని వేల ఎకరాల్లో సాగు జరుగుతున్నది. వరి సాగులో తెలంగాణ ఎంతో పురోభివృద్ధి సాధించింది.
– సుప్రీంకోర్టు (21.05.2025)
కాళేశ్వరం ప్రాజెక్టుతో వరి సాగు పెరిగిపోవడంతో పంట సాగును ఆపేయాలని ప్రభుత్వమే రైతులపై ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఇది ఓ రికార్డు.
– సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ (09.10.2021)
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతుల్లో కొత్త ఆశలను రేకెత్తించింది. కరువు నేలలను సస్యశ్యామలం చేసింది.
– బీబీసీ 25.03.2020)
ఇంజినీరింగ్ కౌశలానికి కాళేశ్వరం నిర్మాణం ఓ శాశ్వత చిహ్నం.
– అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (23.05.2023)