PAC | నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవిని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు ఇచ్చేందుకు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నది అన్న ప్రశ్న సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆనవాయితీ ప్రకారం కాకుండా ఓ ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టి, రాష్ట్రంలో రెండు రోజులుగా తీవ్ర గందరగోళ పరిస్థితిని సృష్టించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఖరిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలను పారదర్శకంగా నిర్వహించాలనుకున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేను పీఏసీ చైర్మన్‌గా నియమించేందుకు వస్తున్న అడ్డంకులేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
లోక్‌సభ లేదా రాష్ర్టాల అసెంబ్లీల్లో పీఏసీకి ప్రత్యేక ప్రాధాన్యం, ప్రాముఖ్యత ఉన్నాయి. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకతను ప్రదర్శించేందుకు, ప్రభుత్వ సొమ్ము పక్కదారి పట్టకుండా నిరంతరం మానిటరింగ్ చేయడంలో పీఏసీ పాత్ర కీలకం. ఈ కమిటీ ప్రభుత్వ నిధుల ఖర్చు, ఆర్థికపరమైన వ్యవహారాలను పర్యవేక్షించవచ్చు, నిధుల దుర్వినియోగం లేదా అవినీతి వంటి ఆరోపణలపైనా విచారణ జరపవచ్చు, ప్రభుత్వ విభాగాల ఆడిట్ నివేదికలపైనా, ఆర్థిక కార్యకలపాలపైనా సమీక్ష జరపవచ్చు. ఇలాంటి కమిటీకి చైర్మన్‌గా ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యుడిని నియమించడం ద్వారా ప్రభుత్వాలు తమ పారదర్శకతను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాయి. అనేక సంవత్సరాలుగా ఇదే సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్నది. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సాంప్రదాయానికి తూట్లు పొడుస్తూ అడ్డదారులు తొక్కింది. వాస్తవంగా పీఏసీ కమిటీ చైర్మన్‌గా మాజీ మంత్రులు, అసెంబ్లీ వ్యవహారాలపై మంచి పట్టు ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తన్నీరు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డిలో ఎవరో ఒకరికి అవకాశం దక్కాల్సి ఉంది. అలా కాకుండా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పీఏసీ చైర్మన్‌గా ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, నిధుల కేటాయింపు, ఖర్చులను పర్యవేక్షించే అధికారం ఉన్న పీఏసీ కమిటీకి చైర్మన్‌గా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన హరీశ్‌రావు లేదా ప్రశాంత్‌రెడ్డి ఉంటే ఇక్కట్లు తప్పవని సీఎం రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ ముఖ్యులకు భయం పట్టుకున్నట్టు తెలుస్తున్నది. అసలే ప్రభుత్వ పాలనపై, ఆర్థిక వ్యవహారాలపై అంతంతమాత్రం అవగాహన ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులకు వీరు కొరకరాని కొయ్యగా మారుతారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరిగినట్టు సమాచారం. ఇప్పటికే రెండుమార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్దే పైచేయిగా సాగింది. అనేక అంశాల్లో బీఆర్ఎస్ సభ్యులు ముఖ్యంగా కేటీఆర్, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి వంటి సీనియర్లంతా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ నేపథ్యంలో కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి హరీశ్‌రావు వంటి వారికి దక్కితే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవన్నది సీఎం భావన అని సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 10 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సీఎంతోపాటు ఆర్ధిక మంత్రి, ఇతర ప్రభుత్వ ముఖ్యలకు పాలనపై, ఆర్థిక వ్యవహారాలపై సరైన పట్టు దొరకలేదన్న చర్చ సాగుతున్నది. ఈ పరిస్థితుల్లో హరీశ్‌రావు లేదా ప్రశాంత్‌రెడ్డి వంటి వారికి పీఏసీ చైర్మన్ పదవి దక్కితే తమకు ఇబ్బందులు తప్పవని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ నిధుల కేటాయింపు, ఖర్చులు ఇతర ఆర్థిక కార్యకలాపాలపై నిరంతరం పీఏసీ చైర్మన్‌గా నిఘా వేస్తే ప్రభుత్వ డొల్లతనం బహిర్గతం అవుతుందన్న భయంతోనే తమ చెప్పుచేతుల్లో ఉండే వ్యక్తికి బాధ్యతలు అప్పగించారని పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరిన అరికపూడి గాంధీకి ఇవ్వడం ద్వారా అతను టెక్నికల్‌గా బీఆర్ఎస్ అని చూపవచ్చన్నది సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహంగా చెప్తున్నారు.