పీర్జాదిగూడ, డిసెంబర్ 9: తెలంగాణ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే కులవృత్తులు అభివృద్ధి చెందుతున్నాయని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఎనిమిదేండ్లలో గౌడ కార్మికులకు రూ.1,000 కోట్ల మేర పెన్షన్లు అందజేసిన ఘనత తెలంగాణ సర్కార్కే దక్కుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం చేస్తున్నారని కొనియాడారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పీర్జాదిగూడలో తెలంగాణ గీత పనివారల సం ఘం రాష్ట్ర ద్వితీయ మహాసభను నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తాటి, ఈత వనాలకు నిధులు కేటాయించి వారికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని వివరించారు. చెట్లపై నుంచి పడిపోయి మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు రూ.46.75 కోట్ల మేర సాయం అందజేసినట్టు తెలిపారు. భవిష్యతుల్లో గీత కార్మికులకు మోపెడ్లు పంపిణీ చేస్తామని, హెల్త్ కవరేజీ తీసుకొస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ వీజీగౌడ్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీ ప్రభాకర్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్, వేములయ్యగౌడ్ పాల్గొన్నారు.