(నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి):‘అన్న అంటే తమ్ముడిని, చెల్లెల్ని తండ్రి తర్వాత తండ్రిలా చూసుకునేటోడంటరు. నాకు అన్నలేడు. కానీ, అన్నలేని లోటు తీర్చిండు కేటీఆర్ అన్న. ఈ జీవితంలో ఇంతగనం ఎన్నడూ సంతోషపడలే’ అని పట్టలేని సంతోషంతో చెప్తుతున్నడు అంశల స్వామి. నమస్తే తెలంగాణలో ఆదివారం ప్రచురితమైన ‘తెలంగాణకు కేసీఆర్ ఏం చేసిండో.. స్వామిని అడిగితే చెప్పడా!’ కథనానికి వచ్చిన స్పందన తనలో ఎన్నడూ లేని భావోద్వేగాన్ని, ఆనందాన్ని కలిగించిందని చెప్తున్నడు. కొడుకు ఎదుగుతుంటే తల్లిదండ్రులకు ధైర్యం. కానీ, తమలాంటి ఫ్లోరోసిస్ బాధితులు ఎదుగుతుంటే గుండెల్లో దిగులు పెరుగుతుంది. చేతికొచ్చిన కొడుకు తమను ఆదుకోవాల్నని కన్నవాళ్లు కోరుకొంటరు. కానీ, తన తల్లిదండ్రులు ‘మా తర్వాత మా బిడ్డని ఎవరు చూసుకుంటార’ని దిగులుపడ్డారు. ‘నాకో ఇల్లు కట్టిచ్చి, బతుకుదెరువు చూపించి, మా అమ్మా నాన్నకు ఆ దిగులు తీర్చిన రామన్న గురించి తెలుసుకొని ఎంతోమంది ఫోన్లు జేస్తున్నరు. తండ్రి తర్వాత అన్నే అంటరు. మా నాన్న ముసలితనంతో ఉండి ఆదుకొనే పరిస్థితి లేకున్నప్పుడు రామన్నకు నా కష్టాలు చెప్పుకున్న.
నాకు అన్న లేడన్న లోటు లేకుండ నేనున్న అని వెంటనే చెప్పిండు. కాళ్లూ, చేతులూ పడిపోయిన మే ముగ్గురం ఇల్లు కట్టించుకోలేమని తన మనుషులకు బాధ్యత చెప్పిండు. కర్నాటి విద్యాసాగర్కి బాధ్యత ఇచ్చి వెంట బడినట్టే ఇల్లు కట్టించిండు. సెలూన్ పెట్టించిండు. ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి నడిపిన ఉద్యమంలో 30 ఏండ్లు తిరిగిన. నల్లగొండ జిల్లాలో నా బాధ అందరికీ తెలుసు. మా బిడ్డలు స్వామి లెక్క కాకూడదని ఉద్యమంలోకి వచ్చిన్రు. మంచినీళ్లిచ్చి అందరికీ మేలు చేసిన కేసీఆర్.. నీకేమి చేసిండు స్వామి అన్న వాళ్లకు ఇదిగో.. నాకు నీళ్లే కాదు. ఉండనీకి ఇల్లు.. బతకనీకి షాపు పెట్టిండని అందరితో వాట్సాప్లో పంచుకున్న. రాష్ట్రపతుల్ని, ప్రధానమంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని కలిసిన నువ్వు ఇన్నాళ్లకు కేసీఆర్ పాలన వల్ల, రామన్న దయ వల్ల అనుకొన్నది సాధించినవని అందరూ చెప్తుంటే చాలా సంతోషపడ్డ. నాతో ధర్నాలు చేసినోళ్లు నమస్తే తెలంగాణ పేపర్లో నా ఇల్లు, నా షాప్ చూసి పరేషాన్ అయిన్రు.‘మా వోడికి మేలు జేసిన్ర’ని వాళ్లు గూడ నా లెక్కనే సంతోషంగున్నరు.
నమస్తే తెలంగాణ ఉద్యమ కాలంలో మా నీళ్ల గోస రాసింది. తెలంగాణలో బాగుపడ్డ బతుకుల్ని చెప్తున్నది. శివన్నగూడెం ప్రాజెక్ట్ పూర్తి కావాలె. ఇట్లనే ఫ్లోరైడ్ రాకుండా బోవాలె. నా లెక్క ఇంకెవ్వరూ కాకూడదని అందరూ అంటున్నరు. కేసీఆర్ ఉండాలె.. అనుకున్నది జరగాలని అందరూ చెప్తున్నరు. కొండంత అండగా నిలిచి కోరిన కోరికలే కాదు అడగని కోరికలూ తీర్చే మా కేటీఆర్ అన్నలా ప్రేమ చూపిండు. ఈ మేలు ఎన్ని జన్మలకైనా మరువను. ఆయన ప్రేమకు కృతజ్ఞుడిని’ అని స్వామి ఆనందబాష్పాలు రాల్చాడు.