హైదరాబాద్, మే31 (నమస్తే తెలంగాణ) : ‘తమ్మిడిహట్టి అంశంపై చర్చించేందుకు మహారాష్ట్రకు లేఖ రాసినా పట్టించుకోవడం లేదు’ అని తెలంగాణ సర్కార్ ప్రగల్భాలు పలుకుతున్నది. కానీ, అసలు వాస్తవం మరోలా ఉన్నది. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియ చేపట్టనేలేదు.. పైసా విదిల్చలేదని ఇంజినీర్ల నుంచే విస్మయం వ్యక్తమవుతున్నది. తమ్మిడిహట్టి బరాజ్ నిర్మిస్తామని సర్కార్ హడావుడి చేయడమే తప్ప ఆచరణలో అడుగు కూడా ముందుకుపడటం లేదు. కనీసం ప్రాజెక్టు డీపీఆర్‌ను సిద్ధం చేయనేలేదు. దానికోసం కొద్దిమొత్తం బిల్లులను కూడా విడుదల చేయలేదు. బిల్లులిస్తే తప్ప డీపీఆర్ ఇవ్వలేమని ఏజెన్సీ ప్రతినిధులు తేల్చిచెప్తున్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తమ్మిడిహెట్టి -సుందిళ్ల బరాజ్ లింక్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి రూ.11.88 కోట్లతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది.
తమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు 116 కి.మీ. కాగా, గతంలో 5 ప్యాకేజీలుగా విభజించారు. అందులో ప్యాకేజీ-3 అనేది పూర్తిగా బరాజ్ నిర్మాణం. ప్యాకేజీ-1 అనేది 0-15 కి.మీ. వరకు కాలువ, ప్యాకేజీ-2లో 15-28.5 కి.మీ. కాలువ, ప్యాకేజీ-4లో 28.5 నుంచి 71.5 కి.మీ. మైలారం వరకు కాంక్రీట్ లైనింగ్ లేని కాలువ తవ్వకం పనులు. అత్యంత కీలకమైంది ప్యాకేజీ 5 పనులు. ఇందులో మొత్తంలో 44.50 కి.మీ. నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉన్నది. కానీ, ప్రస్తుతం తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి కాకుండా సుందిళ్లకు జలాలను మళ్లించాలని నిర్ణయించారు. తద్వారా దూరం, ఆర్థికభారం తగ్గుతుందని ప్రభుత్వం చెప్తున్నది. 71 కి.మీ. మైలారం నుంచి సొరంగాలు, ఓపెన్ కెనాల్ ద్వారా సుందిళ్లకు నీటిని మళ్లించాలని నిర్ణయించింది.
ప్యాకేజీ-3 బరాజ్ నిర్మాణం, ప్యాకేజీ-5 పనులకు సంబంధించి అంచనాలను, డీపీఆర్, ప్రీఫిజబులిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్) తయారీకి ప్రభుత్వం గత నవంబర్లోనే టెండర్లను ఆహ్వానించింది. ఆర్వీ అనే ఒకే ఒక ఏజెన్సీ బిడ్ దాఖలు చేయగా, సదరు సంస్థకే బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికీ సదరు సంస్థకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో డీపీఆర్, పీఎఫ్ఆర్ తయారీ ఎక్కడికక్కడ పడకేసిందని తెలుస్తున్నది. నిధులిస్తే కాని నివేదికలు సిద్ధమయ్యే పరిస్థితి లేదని ఇరిగేషన్ అధికారులకు సదరు ఏజెన్సీ ప్రతినిధులు తెగేసి చెప్పినట్టు సమాచారం.
బరాజ్ డిజైన్లు, తదితర అంశాల పరిశీలనకు క్షేత్రస్థాయికి వెళ్లాలని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో)ను సర్కార్ ఆదేశిస్తున్నది. సీడీవో విభాగం ఇంజినీర్లు మాత్రం ఆ దిశగా మాత్రం దృష్టి సారించడం లేదు. కీలకమైన జియోటెక్నికల్ పరీక్షలు పూర్తిగాకుండా వెళ్లి తాము ఏంచేస్తామని వారు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఈ దశలో ప్రభుత్వం నిధులిస్తే తప్ప పరీక్షలు ముందుకు సాగేలా లేవు. డీపీఆర్, పీఎఫ్ఆర్ తయారీ పనులు ఎక్కడికక్కడ పడకేశాయి. నిధులు వెచ్చించాలని విన్నవించుకొన్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. లేఖ రాసినా మహారాష్ట్ర సర్కర్ పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కారణంగా చూపడంపై ఇంజినీరింగ్ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది.
బరాజ్ నిర్మాణానికి సదరు ఏజెన్సీ సంస్థ ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వేలను పూర్తిచేసింది. హైడ్రాలాజికల్ సర్వేలను అధ్యయనం చేసింది. కీలకమైన ప్రతిపాదిత నిర్మాణ స్థలంలో కీలకమైన జియో టెక్నికల్ టెస్టులు నిర్వహించాల్సి ఉన్నది. అందుకోసం బోర్‌హోల్స్ ద్వారా స్ట్రాటాను సేకరించి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అవిగాకుండా కీలకమైన ఇతర సాంకేతిక పరీక్షలనూ ఏజెన్సీ నిర్వహించలేదని తెలుస్తున్నది. అందుకు ప్రధాన కారణం నిధుల లేమి కారణమని తెలుస్తున్నది. ఇప్పటికే సర్వేలు తదితర పరీక్షల కోసం రూ.కోటికి పైగా ఖర్చు చేసినట్టు ఏజెన్సీ ప్రతినిధులు వివరిస్తున్నారని ఇంజినీర్లు చెప్తున్నారు. తదుపరి పరీక్షలకు సైతం ఎక్కువ మొత్తంలో నిధులు అవసరమని తెలుస్తున్నది. కనీసం ఇప్పటికప్పుడు రూ.2 కోట్ల వరకైనా నిధులు విడుదల చేయాలని ఒత్తిడి చేస్తున్నట్టు ఇంజినీరింగ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా స్పందనలేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికీ ఒక్క రూపాయి విడుదల చేయలేదని వివరిస్తున్నారు.