Musi River | మూసీ అభివృద్ధికి ‘థేమ్స్ యాక్షన్ ప్లాన్’ను అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి.. దాన్ని పక్కనబెట్టి బడుగుల ఇండ్లను కూల్చడమే లక్ష్యంగా తన ‘యాక్షన్ ప్లాన్’ను ముందుకు తీసుకుపోతున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కూల్చివేత చర్యలను చూస్తే జనవరిలో లండన్ పర్యటనలో సీఎం అసలు ‘థేమ్స్ నది పునరుజ్జీవ ప్లాన్’పై నిజంగానే అధ్యయనం చేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. థేమ్స్‌ను శుద్ధిచేయడానికి నది ఒడ్డున నివసిస్తున్న ఏ ఒక్కరినీ తరలించలేదు. ఒక్క ఇంటిని కూడా కూల్చలేదు. అయితే, ఇక్కడ మూసీనదీ పరీవాహకప్రాంతాల్లో ఇండ్ల తొలగింపు నిత్యకృత్యంగా మారింది. ఈ ఒక్క విషయమే కాదు సీవరేజ్ ట్రీట్మెంట్, ఫ్లడ్ కంట్రోల్ కార్యాచరణ తదితర విషయాల్లోనూ ‘థేమ్స్ ప్లాన్’ను మన ప్రభుత్వం ఎక్కడా అనుసరించినట్టు కనిపించట్లేదు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): మూసీ అభివృద్ధికి థేమ్స్ నది ప్లాన్‌ను అమలు చేస్తామని జనవరిలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. దీనికోసం లండన్‌లో ఆయన మూడురోజుల పాటు ప్రత్యేకంగా పర్యటించారు కూడా. అయితే, క్షేత్రస్థాయిలో థేమ్స్ నది ప్లాన్‌ను మూసీకి అన్వయిస్తున్నట్టు కనిపించడంలేదు. మూసీ సుందరీకరణ పేరిట బడుగు వర్గాలు కట్టుకున్న ఇండ్లను కాంగ్రెస్ సర్కారు నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తుండటమే దీనికి రుజువు.
కాలుష్యానికి చిరునామాగా..
శతాబ్దాల చరిత్ర కలిగి, ఒకప్పుడు కాలుష్యానికి చిరునామాగా ఉండే థేమ్స్ నది.. ఇప్పుడు స్వచ్ఛమైన జీవనధారగా మారింది. ఏండ్లకేండ్లు చిత్తశుద్ధితో కూడిన పకడ్బందీ చర్యలతోనే ఇది సాకారమైంది. 346 కిలోమీటర్ల పొడవైన థేమ్స్‌నది ఇంగ్లండ్‌కు నైరుతి దిశగా ఉన్న గ్ల్లౌసెస్టర్షైర్ రాష్ట్రంలోని థేమ్స్హెడ్ పర్వతాల్లో ప్రారంభమౌతుంది. టెడ్డింగ్టన్, స్టెయిన్స్ అపాన్ థేమ్స్, హెన్లే ఆన్ థేమ్స్, ఆక్స్ఫర్డ్, రీడింగ్, మైడెన్‌హెడ్, విండ్సోర్, లండన్ తదితర నగరాల గుండా ప్రవహించి ఉత్తర సముద్రంలో కలుస్తుంది. క్రీస్తుశకం 45వ సంవత్సరం నుంచే థేమ్స్ నది ఒడ్డున పట్టణ నాగరికత పరిఢవిల్లినట్టు చరిత్ర చెప్తున్నది. 18వ శతాబ్దంలో ఐరోపావ్యాప్తంగా పారిశ్రామికీకరణ ఊపందుకోవడం, నగర జనాభా పెరిగిపోవడంతో ఇంగ్లండ్ పట్టణాల గుండా ప్రవహిస్తున్న థేమ్స్ నదిలో వ్యర్థాలు కలవడం పెరిగింది. దీంతో అప్పటివరకూ స్వచ్ఛమైన నీటితో అలరారే థేమ్స్ కాలుష్యానికి చిరునామాగా మారింది.
క్వీన్ విక్టోరియా కూడా..
థేమ్స్ నది ఒడ్డున నివాసాలు, పరిశ్రమలు పెరిగిపోవడంతో నదిలో కలిసే వ్యర్థాల మోతాదు పెరిగిపోయింది. ‘థేమ్స్కంపు కొడుతున్నది. నది ఒడ్డున నిలబడలేని స్థితి’ అంటూ 1858 జూన్ 29న క్వీన్ విక్టోరియా తన కుమార్తెకు పంపిన లేఖలో రాశారంటే నది పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. థేమ్స్‌ను ప్రక్షాళన చేయకపోతే, భవిష్యత్తు తరాల మనుగడకే ముప్పు అని గ్రహించిన అప్పటి ప్రభుత్వం తాత్కాలిక చర్యలను ముమ్మరం చేసింది. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు థేమ్స్లో కలవనీయకుండా ప్రత్యేక మార్గాల్లో డిస్పోజ్ చేయడం వంటి పనులు చేపట్టింది. అయితే, కొద్దికాలం వరకు మాత్రమే ఇవి సత్ఫలితాలను ఇచ్చాయి. జనాభా పెరిగిపోవడం, ఫ్యాక్టరీ వ్యర్థాల మోతాదు పరిధిని మించిపోవడంతో శాశ్వతమైన యాక్షన్ ప్లాన్ అవసరమైంది. దీంతో ‘థేమ్స్ యాక్షన్ ప్లాన్’ తెరమీదకు వచ్చింది.
కాలుష్య నియంత్రణ
థేమ్స్ నదిని కాలుష్యానికి దూరంగా ఉంచాలంటే తొలుత మురుగు నియంత్రణే మార్గమని 1858లో సివిల్ ఇంజినీర్ సర్ జోసఫ్ బెజెల్గెట్ భావించారు. ఇందుకోసం నది ప్రవహించే మార్గానికి రెండువైపులా భూగర్భంలో సొరంగాలను నిర్మించారు. ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక మురుగునీటి నిర్వహణ ట్యాంకును ఏర్పాటుచేశారు. ‘సీవరేజ్ నెట్వర్క్’గా పిలిచే ఈ ట్యాంకులకు ఆ సొరంగాలను పైపులతో అనుసంధానించారు. ఇండ్లు, పరిశ్రమల్లోని వ్యర్థాలు పైపుల గుండా డైరెక్టుగా మురుగునీటి నిర్వహణ ట్యాంకులకు చేరుతాయి. నదిలో కలవవు. అలా నదిలో కాలుష్య వ్యర్థాలు కలవకుండా కట్టడి జరిగింది. దశాబ్దాలు గడిచినప్పటికీ ఈ టెక్నిక్‌నే ఇప్పటికీ పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ (పీఎల్ఏ) అమలు చేస్తున్నది. ఆ తర్వాత 25 కిలోమీటర్ల పొడవైన ‘థేమ్స్ టైడ్వే టన్నెల్’ను ఏర్పాటుచేశారు. దీని సాయంతో వ్యర్థాలతో కూడిన నీరు థేమ్స్ నదిలో కలవకుండా ప్రత్యేక మార్గం ద్వారా సీవరేజ్ ట్యాంకుల్లో శుద్ధి అవుతున్నది. ఈ శుద్ధి అయిన నీటిని థేమ్స్ పరీవాహంలో పెంచుతున్న ప్రత్యేకమైన ఉద్యానవనాల్లోని మొక్కలకు వినియోగిస్తున్నారు. అలా థేమ్స్ నది కాలుష్యంబారిన పడకుండా రక్షించబడింది. ఇండ్లను, వాణిజ్య సముదాయాలను కూల్చకుండానే, ప్రజలను తరలించకుండానే ‘థేమ్స్ టైడ్వే టన్నెల్’ నిర్మాణం ఇటీవలే జరగడం విశేషం.
వరదల నియంత్రణ
‘థేమ్స్ యాక్షన్ ప్లాన్’లో రెండోది వరదల నియంత్రణ. లండన్ వంటి జనాభా ఎక్కువగా ఉన్న నగరాల గుండా నదీప్రవాహం ఉన్నప్పుడు ఎప్పుడైనా వరదలు సిటీని ముంచెత్తవచ్చు. దీనికి చెక్ పెట్టడానికి వరదల నియంత్రణ కోసం థేమ్స్ నది నగరంలోకి ప్రవేశించే మార్గంలో ‘థేమ్స్ బ్యారియర్’ పేరిట ప్రభుత్వం ఓ భారీ నిర్మాణాన్ని చేపట్టింది. 3.2 కిలోమీటర్ల వెడల్పుతో పెద్దపెద్ద నియంత్రణ గేట్లను నదికి అడ్డంగా అమర్చారు. ప్రవాహ ఉధ్దృతి పెరగడాన్ని ముందే అంచనా వేసే ఈ అత్యాధునిక వ్యవస్థ 1984 నుంచి ఇప్పటివరకూ థేమ్స్ నదికి 200కు పైగా వరదలు వచ్చినప్పటికీ సమర్థంగా నియంత్రించగలిగింది. ప్రవాహానికి సంబంధించి ముందస్తు రీడింగ్స్ తెలియజేయడం, కాలువల్లోకి నీటిని మళ్లించడంతో వరదలను బ్యారియర్ కట్టడి చేస్తుంది.
నిర్మాణాలు కూల్చకుండానే..
థేమ్స్ నది ఒడ్డున కోటికి పైగా ఇండ్లు, ఫ్యాక్టరీలు, వాణిజ్య సముదాయాలు ఉంటాయని అధికారుల అంచనా. అయితే, మురుగునీటి నిర్వహణ పేరిట నిర్మించిన ‘సీవరేజ్ నెట్వర్క్’ కోసంగానీ, వరదల నియంత్రణ కోసం నిర్మించిన ‘థేమ్స్ బ్యారియర్’ కోసంగానీ ఇప్పటివరకూ ఏ ఒక్క నిర్మాణాన్ని కూడా కూల్చేయలేదని పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ రికార్డులను బట్టి తెలుస్తున్నది. మురుగునీటి కోసం నిర్మించిన సొరంగాలను రోడ్డుకు మధ్యలో ఒక మీటరు వెడల్పుతో ఏర్పాటు చేశామని, మురుగునీటి నిర్వహణ ట్యాంకులను ప్రభుత్వానికి చెందిన ఖాళీ ప్రదేశంలో నిర్మించినట్టు అధికారులు తెలిపారు. వరదల నియంత్రణకు తీసుకొచ్చిన ‘థేమ్స్ బ్యారియర్’ను నది మధ్యలో నిర్మించినట్టు వివరించారు. ఇక, ఇండ్లల్లో ఉండే ప్రజలకు, వాణిజ్య కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురవకుండా రాత్రిళ్లు, సెలవు దినాల్లోనే ఈ పనులను చేపట్టామని, ప్రజలను ఎక్కడికీ తరలించలేదని వివరించారు.
లండన్ ఉనికే ప్రశ్నార్థకమయ్యేది
మూసీ నది పరీవాహక ప్రాంతంలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మాణాలు ఉన్నాయంటూ రేవంత్ ప్రభుత్వం పేదల ఇండ్లను బుల్డోజర్లతో కూలదోస్తున్నది. అయితే, ఈ నియమాలనే థేమ్స్ నది ఒడ్డున అమలు చేస్తే, లండన్‌లోని దాదాపు 40 శాతం నిర్మాణాలు కనిపించకుండా పోతాయని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన స్కాలర్ ఒకరు తెలిపారు. లండన్‌లో ప్రఖ్యాతిగాంచిన హ్యాంప్టన్ కోర్టు ప్యాలెస్, టేట్ బ్రిటన్, టేట్ మాడర్న్, ప్యాలెస్ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్, లండన్ ఐ, టవర్ బ్రిడ్జి, హెచ్ఎంఎస్ బెల్ఫాస్ట్, టవర్ ఆఫ్ లండన్, గ్రీన్విచ్ పార్క్ తదితర కట్టడాలు, నిర్మాణాలు బఫర్ జోన్లోనే ఉన్నాయని గుర్తు చేశారు. ఇక, ఇంగ్లండ్‌లో థేమ్స్ నది ఒడ్డున ఒకవిధంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఏకంగా ఏడు నగరాలు నిర్మితమయ్యాయంటే షాక్ అవకుండా ఉండలేం. ప్రపంచ టూరిస్ట్‌లను ఆకర్షిస్తున్న మార్లో, మైడెన్‌హెడ్, విండ్సోర్, ఈటోన్, రీడింగ్, హెన్లే ఆన్ థేమ్స్, కింగ్స్టన్ అపాన్ థేమ్స్ తదితర నగరాలు థేమ్స్ నది ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి. రేవంత్ సర్కారు ఎఫ్టీఎల్ నిబంధనలు అక్కడగనుక అమలు చేస్తే, ఈ నగరాలన్నింటినీ నేలమట్టం చేయాల్సిందే.
కూల్చాల్సిన పనిలేదు..
ఎఫ్టీఎల్, బఫర్ పరిధి పేరిట, వరదలు ముంచెత్తుతాయన్న కారణంతో నది ఒడ్డున ఉన్న నిర్మాణాలను కూల్చేయాల్సిన పనిలేదని పీఎల్ఏ అధికారులు చెప్తున్నారు. ‘థేమ్స్ బ్యారియర్’ సాయంతో థేమ్స్ నది ప్రవాహ ఉద్ధృతిని ఎప్పటికప్పుడు నియంత్రించడంలో తాము సక్సెస్ అయిన విధానాన్ని గుర్తుచేస్తున్నారు. ‘థేమ్స్ బ్యారియర్’తో థేమ్స్ నది ఒడ్డున ఉన్న కట్టడాలకు వరద ముప్పు లేకుండా పోయిందని చెప్తున్నారు. ‘థేమ్స్ యాక్షన్ ప్లాన్’లో భాగంగా చేపట్టిన ఈ చర్యలతో పురాతన కట్టడాలు ఇప్పటికీ కనుమరుగవ్వలేదు. పర్యాటకరంగం కూడా భారీగా పుంజుకొన్నది. ప్రతీ పదేండ్లకోసారి థేమ్స్ యాక్షన్ ప్లాన్‌ను ఆధునీకరిస్తామని, కొత్త సాంతకేతికతతో వినూత్న విధానాలను అందిపుచ్చుకొంటామని పీఎల్ఏ అధికారులు తెలిపారు. అందుకే, థేమ్స్ ఇప్పటికీ, స్వచ్ఛతను కోల్పోలేదని పేర్కొన్నారు.
780 ఏండ్ల కిందటే యాక్షన్ ప్లాన్‌కు బీజం
13వ శతాబ్దంలో ఇంగ్లండ్‌లో గతంలో ఎన్నడూచూడని నీటి కరువు తాండవించింది. దీంతో అప్పటి ప్రభుత్వం 1245 సంవత్సరంలో 2.7 మైళ్ల పొడవుతో ఓ పెద్ద సొరంగాన్ని థేమ్స్ నదీ గర్భంవరకూ నిర్మించింది. థేమ్స్లో ప్రవహిస్తున్న నీటిలో కొంత ప్రవాహాన్ని పక్కకు తరలించడమే ఈ సొరంగం ప్రధాన ఉద్దేశం. అలా పక్కకు సేకరించిన నీటిని పైపుల ద్వారా మళ్లించి శుద్ధిచేసి సుదూర ప్రాంతాలకు సరఫరా చేసేవారు. ఆ తర్వాతి కాలంలో ఈ పైపుల సంఖ్యను పెంచారు. థేమ్స్ పునరుజ్జీవ కార్యక్రమంలో దీన్ని తొలి ఘట్టంగా చెప్తారు.లండన్ పర్యటనలో ఉన్నప్పుడు థేమ్స్ నది నిర్వహణ తీరు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిపై అధ్యయనం చేశా. థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్‌లోని మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టు చేపడతాం.
– జనవరి 19న సీఎం రేవంత్ రెడ్డి