హైదరాబాద్, జనవరి 27 (నమస్తేతెలంగాణ): టీజీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 9 లోగా తమ 21 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని అల్టిమేటం జారీ చేశాయి. లేకుంటే అదేరోజు నుంచి సమ్మె తప్పదని హెచ్చరిక జారీ చేశాయి. ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల రద్దుతోపాటు ఎన్నాళ్ల నుంచో పెండింగ్‌లో ఉన్న సమస్యలు తీర్చాల్సిందేనని గత కొన్నాళ్లుగా టీజీఎస్ ఆర్టీసీ జేఏసీగా ఏర్పడిన కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమ్మెబాట పట్టేందుకు సిద్ధమయ్యాయి.
ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు సోమవారం సమ్మె నోటీసు ఇచ్చారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో సోమవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) మునిశేఖర్‌కు ఆర్టీసీజేఏసీ నేతలు సమ్మె నోటీసును అందించారు. మొత్తం 21 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుపెట్టారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఫిబ్రవరి 9 నుంచి సమ్మె చేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ఉద్యోగుల, కార్మికుల సమస్యలను పట్టించుకోవడమే లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో డిపోలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థల చేతుల్లో పెడుతుందని, దీంతో తాము ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయలేదని, 2021 పీఆర్సీ, 2017 పెండింగులో ఉన్న వేతన బకాయిల సమస్యలను పరిష్కరించనే లేదని చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ ట్రేడ్ యూనియన్లకు ఎన్నికలు నిర్వహించకుండా, యూనియన్లను రద్దుచేసి, కార్మికుల పనిగంటలు పెంచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నెల 22న జరిగిన ఆర్టీసీ జేఏసీ నేతల సమావేశంలో సమ్మె నోటీస్ ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకున్నామని ఆర్టీసీ జాక్ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో-కన్వీనర్ కే యాదయ్య, ఎస్ సురేశ్, బీ యాదయ్య వివరించారు.
ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సమ్మె నోటీస్ ఇచ్చేందుకు సోమవారం హైదరాబాద్ బస్‌భవన్‌కు వస్తారన్న సమాచారంతో పోలీసులు ముందుగానే భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. వివిధ పోలీస్స్టేషన్లతోపాటు ప్రత్యేక దళాలను కూడా బస్‌బవన్ వద్ద మోహరించారు. సమ్మె నోటీస్ ఇచ్చేందుకు వచ్చిన కార్మిక సంఘాల నేతలను మాత్రమే లోపలికి అనుమతించారు.
1. ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల ముందు, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేయాలి.
2.ఆర్థికపరమైన అంశాలను పరిష్కరిస్తూ, ప్రస్తుత సౌకర్యాలనే కొనసాగిస్తూ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలి.
3.2021 వేతన సవరణను అమలు చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలి
4.2017 వేతన సవరణ బకాయిలను చెల్లించి, రిటైర్డ్ ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయాలి.
5.కొత్త బస్సుల కొనుగోలు ద్వారా ఆర్టీసీని అభివృద్ధి పరిచి, ఆధునీకరించాలి.
6.సంస్థ అప్పలను ప్రభుత్వమే టేకోవర్ చేసి, రాయితీలకు, సంస్థ అభివృద్ధికి ప్రతి ఏటా బడ్జెట్లో 3 శాతం కేటాయించాలి.
7. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి, ఆర్టీసీకి ఇవ్వాలి.
8. యాజమాన్యం వాడుకున్న సీసీఎస్, ఎస్ఆర్బీఎస్, పీఎఫ్ నిధులను వెంటనే విడుదల చేయాలి. సీసీఎస్‌లో ఎన్నికలు నిర్వహించి, కార్యాలయ సిబ్బంది ఖాళీలను భర్తీచేయాలి.
9.మహాలక్ష్మి పథకంలో జీరో టికెట్ బదులు మహిళలకు స్మార్ట్‌కార్డు ఇవ్వాలి. రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. ఈ స్కీమ్‌లో జరుగుతున్న సీ,టీ కేసుల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి.
10. బ్రెడ్ విన్నర్, మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగుల కుటుంబాలకు ఇచ్చే ఉద్యోగాలు రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలి. ప్రస్తుతం కన్షాలిడేటెడ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి. ప్రభుత్వ జీవో ఎంఎస్ నంబర్ 30 ప్రకారం వయోపరిమితిని 44 ఏండ్లకు పెంచాలి. ఈ స్కీమ్‌లో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ వంటి పోస్టులను కూడా ఇవ్వాలి.
11. అన్ని క్యాటగిరీలలో ఖాళీలను భర్తీచేసి అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలి.
12. ప్రతి కార్మికుడికి 21 రోజుల హాజరుతో ఇన్సెంటివ్ ఇవ్వాలి. బస్‌బాడీ బిల్డింగ్తోపాటు మిగతా వర్క్‌షాప్‌లను బలోపేతం చేయాలి.
13. తార్నాక దవాఖానలోని అన్ని విభాగాల్లో సిబ్బందిని రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలి. రోగులు, వారి వెంట వస్తున్న అటెండెంట్లకు భోజన వసతి సౌకర్యం కల్పించాలి.
14. ఆర్టీసీ ఉద్యోగులకు తార్నాక దవాఖానలో మెరుగైన వైద్యసౌకర్యాలను కల్పిస్తూ, ఉద్యోగి కుటుంబానికి సూపర్ స్పెషాలిటీ హాస్సిటల్స్‌లో కూడా వైద్యసౌకర్యం కల్పించాలి. రిటైరైన ఉద్యోగులకు మందులు సరఫరా చేయాలి. వైద్య పరీక్షలకయ్యే ఖర్చులను యాజమాన్యమే భరించాలి.
15. అకౌంట్స్ విభాగంలో సెంట్రలైజేషన్ విధానాన్ని రద్దుచేసి పాత విధానాన్ని కొనసాగించాలి. ఔట్సోర్సింగ్ ద్వారా కన్సల్టెన్సీ పేరున జరుగుతున్న ఆర్థిక దుబారాను అరికట్టాలి.
16. అన్ని యూనిట్లలో మహిళలతోపాటు పురుషులకు కూడా అన్ని వసతులతో పాటు తాగునీరు, వాహనాల పార్కింగ్‌కు సరిపడా షెడ్లు నిర్మించాలి.
17. పాత నిబంధనలను మార్చి డ్రైవర్, కండక్టర్, నిర్వహణ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి. అక్రమ సస్సెన్షన్ , రిమూవల్ అయినవారిని, అప్పీల్ రిజెక్ట్ అయినవారిని విధుల్లోకి తీసుకోవాలి.
18. టెస్ట్ పాసైన వారికి జూనియర్ అసిస్టెంట్ పోస్టింగ్ ఇవ్వాలి. మిగిలిన ఖాళీలకు డిపార్టుమెంట్ టెస్ట్‌లు నిర్వహించి భర్తీచేయాలి.
19. 2019ం సమ్మెకాలంలో ఉద్యోగులపై నమోదుచేసిన కేసులను ఎత్తివేయాలి.
20. అద్దె బస్సు డ్రైవర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. పీఎఫ్ కాంట్రిబ్యూషన్ రికవరీ చేయాలి.
21. ఎంటీడబ్ల్యూ యాక్ట్ ప్రకారం 8 గంటల పనిదినాలు (సిటీ సర్వీసులలో 7 గంటలు) అమలు చేసి మహిళా కండక్టర్లకు రాత్రి 8గంటలలోపు పూర్తయ్యేలా డ్యూటీలు ఇవ్వాలి. ప్రతి కార్మికుడికి నెలకు 3 రోజులు సెలవులు మంజూరు చేయాలి.
ప్రైవేటు బస్సులు ఆర్టీసీలో ప్రవేశపెట్టి సంస్థ మనుగడకే ప్రమాదం కలిగేలా చేస్తున్నారు. ఆర్టీసీ సమస్యల పరిషారం కోసం సీఎం, మంత్రులు అందరినీ కలిశాం. అయినా మా సమస్యలను పరిషరించనేలేదు. గత ప్రభుత్వం విలీన ప్రక్రియను 90 శాతం పూర్తిచేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? 2021 పీఆర్సీ ఇవ్వడంలేదు.14 నెలలు సమయం ఇచ్చాం. ఇక మాకు ఓపిక లేదు.
– ఈదురు వెంకన్న, ఆర్టీసీ జాక్ చైర్మన్
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేయాలి. కార్మికుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలి. 2021 పీఆర్సీని ప్రకటించి, 2017 బకాయిలను చెల్లించాలి. 15 రోజుల్లో యాజమాన్యం స్పందించి మా డిమాండ్లను నెరవేర్చాలి. త్వరలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఆర్టీసీ జాక్ ఆధ్వర్యంలో కలిసి, సమ్మెకు మద్దతును కూడగడుతాం. ప్రభుత్వమే ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
– ఎం థామస్‌రెడ్డి, ఆర్టీసీ జాక్ వైస్‌చైర్మన్
ఎలక్ట్రిక్ నిర్వహణను కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడం, ఆ బస్సులకు డిసౌంట్ రూ.కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేటు పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారు. దీనికి ఎస్‌డబ్ల్యూసీ ఐఎన్టీయూసీ, ఎస్‌డబ్ల్యూసీ సీఐటీయూ పూర్తిగా వ్యతిరేకం. ఎలక్ట్రిక్ కొనుగోలుకు ప్రభుత్వాలు ఆర్థిక చేయూతను అందించాలి.
– రాజిరెడ్డి, వీఎస్‌రావు, ఎస్‌డబ్ల్యూసీ (ఐఎన్టీయూసీ), ఎస్‌డబ్ల్యూసీ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శులు
ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో డిపోలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థల చేతుల్లో పెడుతున్నది. ప్రైవేటు కంపెనీల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడం వల్ల తమ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉన్నదన్న ఆందోళన ప్రతిఒక్కరిలో నెలకొన్నది. ఇప్పటివరకు ్రఆర్టీసీ విలీనం గురించే పభుత్వం ఆలోచించడం లేదు. 2021 పీఆర్సీ, 2017 వేతన పెండింగ్ బకాయిల సమస్యలు పరిష్కరించనేలేదు.
– ఎండీ మౌలానా, ఆర్టీసీ జాక్ కో-కన్వీనర్