TGSRTC | రాఖీ పౌర్ణమి నాడు గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్‌పాస్‌ను అందిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్లో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్‌ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడపిల్లకు బర్త్ డే గిఫ్ట్‌గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్‌ను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే కండక్టర్‌తోపాటు గర్భిణీ డెలివరీకి సాయం చేసిన వనపర్తిలోని మదర్ అండ్ చైల్డ్ గవర్న్మెంట్ హాస్పిటల్ స్టాఫ్ నర్స్ అలివేలు మంగమ్మకు డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో ఏడాది పాటు ఉచితంగా ప్రయాణించే బస్‌పాస్‌ను అందించింది.
బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు పురిటినొప్పులతో బాధపడుతున్న గర్బిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న గద్వాల్ డిపోనకు చెందిన కండక్టర్ భారతి, డ్రైవర్ అంజిలతో పాటు నర్సు అలివేలు మంగమ్మను హైదరాబాద్ బస్ భవన్లో మంగళవారం టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వారిని ఘనంగా సన్మానించి, నగదు బహుమతులు అందజేశారు. అనంతరం డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో ఏడాది పాటు ఉచితంగా ప్రయాణించే బస్ పాస్‌ను నర్సు అలివేలు మంగమ్మకు, చిన్నారి ఉచిత బస్ పాస్‌ను గద్వాల డిపో మేనేజర్ మురళీకృష్ణకు అందజేశారు.
గద్వాల-వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో రాఖీ పండుగ రోజున సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధన్ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ జి.భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న నర్సు అలివేలు మంగమ్మ సాయంతో గర్భిణికి పురుడు పోశారు. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు.