హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఆర్టీసీకి సంక్రాంతి కలిసొచ్చింది. పండుగ వేళ నడిపిన బస్సులతో దండిగా ఆదాయం సమకూరింది. ప్రత్యేక బస్సులను నడిపించడంతో టీజీఎస్ ఆర్టీసీకి రూ.112.46 కోట్లు వచ్చాయి. నిరుడు సంక్రాంతికి 4,962 ప్రత్యేక బస్సులను నడిపిస్తే రూ.98.49 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది 5,806 ప్రత్యేక బస్సులను నడిపించగా రూ.112.46 కోట్లు సాధించింది. నిరుటితో పోలిస్తే రూ.14 కోట్లు అదనంగా వచ్చినట్టు ఆర్టీసీ అధికారులు లెకలు వేస్తున్నారు.
సుమారు ఆరు లక్షల ప్రయాణికులు సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లినట్టు వెల్లడించారు. సొంతూళ్ల నుంచి తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం ఈ నెల 19, 20 తేదీల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. కాగా, 17,18వ తేదీల్లో బస్సులు నడిపించినప్పటికీ అనుకున్నంత మంది ప్రయాణించలేదని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఏపీ నుంచి తెలంగాణకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా, ఏపీఎస్ ఆర్టీసీలో సాధారణ చార్జీలే ఉండటంతో అక్కడి ప్రజలు ఎక్కువగా వాటిలోనే ప్రయాణించినట్టు తెలిసింది.