TGSRTC | హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : తమకు పాత బకాయిలు చెల్లించకపోవడంపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2013లో బకాయిల్లో 50 శాతం బాండ్ల రూపంలో ఇచ్చిన యాజమాన్యం, వీటిని ఐదేండ్లలో చెల్లిస్తామని హామీ ఇచ్చింది. 2018లోనే చెల్లించాల్సి ఉన్నా కాలయాపన చేసింది.
దాదాపు 42 వేల మంది కార్మికులకు బాండ్లకు సంబంధించి వడ్డీ, అసలు కలిపి సుమారు రూ.280 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించడంతో పాటు బకాయిలు చెల్లిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కేవలం రూ.80 కోట్ల బాండ్ల బకాయిలనే చెల్లించింది.
ఇవి కేవలం డ్రైవర్ల క్యాటగిరీకే సరిపోయాయని, వారికి కూడా వడ్డీ చెల్లించలేదని, దీంతో ప్రతి కార్మికుడు రూ.25వేల చొప్పున నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల బాండ్ల బకాయిలను ప్రభుత్వం సర్దుబాటు చేయలేదని, ఒక్కో కార్మికుడికి దాదాపు రూ.50 వేల నుంచి రూ.1.50లక్షల వరకు బాండ్ల బకాయిలు రావాల్సి ఉన్నదని చెబుతున్నారు. తక్షణమే ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించడంతో పాటు బాండ్ల బకాయిలు చెల్లించాలని లేదంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.