TGPSC | హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగుల ఆశలు ఆవిరి అవుతూనే ఉన్నాయి. గ్రూప్-1 పరీక్షలను రద్దు చేయాలి.. లేదంటే ఆన్షర్షీట్లను తిరిగి మూల్యాంకనం చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో.. నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. ఇక హైకోర్టు తీర్పును రేవంత్ సర్కార్ బేఖాతరు చేయకుండా.. గ్రూప్-1 పరీక్షలను మళ్లీ నిర్వహిస్తుందనుకున్నారు నిరుద్యోగులు. కానీ గ్రూప్-1 తీర్పుపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. దీంతో టీజీపీఎస్సీ నిర్ణయంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాలను పునర్ మూల్యాంకనం చేయించాలని, లేదంటే పరీక్షలను రద్దు చేసి తాజాగా నిర్వహించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఇవాళ జరిగిన టీజీపీఎస్సీ ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం రీవాల్యూయేషన్ చేస్తే సాంకేతిక సమస్యలు రావొచ్చని టీజీపీఎస్సీ అభిప్రాయపడింది. మొత్తానికి సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో టీజీపీఎస్సీ పిటిషన్ దాఖలు చేయనుంది.
గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీతో పాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలో బీఆర్ఎస్వీ ఆందోళనలు చేపట్టింది. దీంతో బీఆర్ఎస్వీ నేతలను పోలీసులు అరెస్టు చేసి ఆయా పోలీసు స్టేషన్లకు తరలించారు.