Group 2 | హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): గ్రూప్-2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఆది, సోమవారాల్లో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి. నాలుగు పేపర్లకు రాష్ట్రవ్యాప్తంగా 1,368 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,51,847 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 783 పోస్టుల భర్తీకి కేసీఆర్ ప్రభుత్వం గ్రూప్-2 నోటిఫికేషన్ను జారీచేయగా, పలు కారణాలతో పరీక్ష నాలుగుసార్లు వాయిదాపడింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30వరకు రెండో సెషన్లో పరీక్షలు నిర్వహిస్తారు. 5.51లక్షల మంది అభ్యర్థుల్లో ఇప్పటి వరకు కేవలం 77% మంది అభ్యర్థులు మాత్రమే హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. లక్షకుపైగా అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోలేదు.
గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. శనివారం నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రతి అభ్యర్థి బయోమెట్రిక్ హాజరును నమోదుచేయాలని, లేదంటే జవాబుపత్రాన్ని తిరస్కరిస్తామని వెల్లడించారు. మార్చిలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు.