Groups Results | హైదరాబాద్, మార్చి8 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండానే పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంపై దళితసంఘాలు, అభ్యర్థులు భగ్గుమంటున్నారు. గ్రూప్-1,2,3 ఫలితాల ప్రకటన షెడ్యూల్‌ను విడుదల చేయడంపై నిప్పులు చెరుగుతున్నారు. వర్గీకరణ అమలు తరువాతనే ఫలితాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. సుప్రీం తీర్పుననుసరించి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేసేందుకు రాష్ట్ర ప్ర భుత్వం మంత్రి ఉత్తమ్ చైర్మన్‌గా క్యాబినెట్ సబ్‌కమిటీని.. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. నివేదిక సమర్పించగా, క్యాబినెట్ ఆమోదించింది.
2011లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లను వర్గీకరించిం ది. 52,17,684 మంది ఎస్సీ జనాభాగా నిర్ధారించింది. 59 షెడ్యూల్డ్ కులాలను 3 గ్రూపులుగా విభజించింది. ఎస్సీలకు అమలు చేస్తున్న 15% రిజర్వేషన్లను ఏ గ్రూపులో 15ఎస్సీలకు 1%, బీ గ్రూపులో 18ఎస్సీలకు 9%, సీ గ్రూపులో 26 ఎస్సీలకు 5% రిజర్వేషన్ అమలు చేయాలని సిఫారసు చేసింది. ఈ నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆ మోదించింది. నివేదికపైనే ఇప్పటికే సర్వత్రా విమర్శ లు వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వం వర్గీకరణను అమలు ఊసెత్తకుండానే నిరుడు నిర్వహించిన పలు పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధమవ్వడంతో దళితసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ హక్కు రాష్ర్టాలకు ఉం టుందని నిరుడు ఆగస్ట్ 1న సుప్రీం తీర్పునిచ్చింది. వెంటనే అసెంబ్లీ వేదికగా.. సీఎం రేవంత్ వర్గీకరణ అమలు తరువాతనే నోటిఫికేషన్లు జారీచేసి, పోస్టుల భర్తీ చేస్తామని వెల్లడించారు. కానీ మాట తప్పారు. డీఎస్సీ పరీక్షలను నిర్వహించడంతోపాటు, ఫలితాలను విడుదల చేసి నియామకపత్రాలను ఇచ్చారు. ప్రస్తుతం వర్గీకరణ నివేదికను అసెంబ్లీ సైతం ఆమోదించడంతో అమలుకు మార్గం సైతం సుగమమైంది. అయినప్పటి కీ వర్గీకరణ అమలు ఊసెత్తకుండా పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తున్నది. గ్రూప్-1 ఫలితాలను 10న, గ్రూప్2 జీఆర్‌ఎల్‌ను 11న, గ్రూప్3 జీఆర్‌ఎల్‌ను 14న, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అభ్యర్థుల తుది జాబితాను 17న, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల జీఆర్‌ఎల్‌ను 19న ప్రకటించనున్నట్టు షెడ్యూల్ విడుదల చేసింది.
ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై దళితసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గ్రూప్ 1,2,3,4, ఇతర ఉద్యోగాలు డిసెంబర్లో భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నదని.. దీనిని మాదిగలంద రూ ఖండించాలని పిలుపునిచ్చాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా సీఎం రేవంత్‌రెడ్డి ముందుకెళ్తున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిరుడు నిప్పులు చెరిగారు. అయినప్పటికీ మళ్లీ ఆయా పోటీ పరీక్షల ఫలితాల విడుదలకు ప్రభుత్వం షెడ్యూల్‌ను ప్రకటించడంతో దళితసంఘాలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. షెడ్యూల్‌ను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాయి.