హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రిటైరైన వారికి పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని ప్రభుత్వ పెన్షన్‌దారుల సంయుక్త కార్యాచరణ సమితి(టీజీపీజేఏసీ) చైర్మన్ కే లక్ష్మయ్య డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సకాలంలో పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో ఆర్థికభారంతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు ‘పెన్షనర్స్ డైరెక్టరేట్’ ఏర్పాటుచేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నవంబర్‌లో పెద్దఎత్తున మహాసభ నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ, కో చైర్మన్లు పుల్లయ్య, భరత్‌రెడ్డి, సూర్యనారాయణ, నాయకులు కృష్ణప్రసాద్, జనార్దన్భట్, జయప్రకాశ్‌రావు, జ్ఞానేశ్వర్, నరసరాజు, శుభకర్రావు పాల్గొన్నారు.