హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): క్వారీల్లో ఇసుక తవ్వకం, లారీల్లో లోడింగ్, స్టాక్యార్డుల వరకు రవాణా, స్టాక్యార్డుల నిర్వహణ తదితర పనులతోపాటు ఇసుక తవ్వకానికి అవసరమైన ఎక్స్కవేటర్లు, ఇసుక రవాణా కోసం టిప్పర్లను సమకూర్చేందుకు టీజీఎండీసీ ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు ఈ నెల 28 వరకు గడువు ఇచ్చిన టీజీఎండీసీ.. అర్హతల ఆధారంగా మార్చి 1న ఏజెన్సీలను ఎంపిక చేయనున్నది. కాగా, అధికారులు సృష్టించిన కృత్రిమ కొరతతో హైదరాబాద్లో ఇసుక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాష్ట్రంలో గత కొంతకాలంగా ఇసుక తవ్వకం, స్టాక్యార్డుల వరకు రవాణా, లోడింగ్ తదితర పనులను కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్నారు.
చాలా క్వారీల్లో కాంట్రాక్టర్ల గడువు ఇదివరకే ముగిసిపోయింది. అయినప్పటికీ కాంట్రాక్టర్లు, టీజీఎండీసీ అధికారులు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతుండడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్నది. మరోవైపు వినియోగదారులకు సకాలంలో సరసమైన ధరకు ఇసుక సరఫరా జరగడంలేదు. ఈ అక్రమాలకు చెక్ పెట్టడంతోపాటు వివిధ క్వారీల్లో ఇసుక తవ్వకాలు, స్టాక్యార్డుల నిర్వహణ పనులు సక్రమంగా జరిగేలా చూసేందుకు టెండర్ల ద్వారా ఏజెన్సీలను ఎంపిక చేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక ధరలు అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోయాయి. అక్రమాల నివారణ పేరుతో అధికారులు చర్యలు ప్రారంభించినప్పటినుంచి బహిరంగ మార్కెట్లో ఇసుకకు తీవ్ర కొరత ఏర్పడింది. ఇసుక రవాణాలో 20-30 కేజీల తేడా వచ్చినా పోలీసులు కేసులు నమోదుచేసి, లారీలను సీజ్ చేస్తుండటంతో అనేక మంది యజమానులు తమ లారీలను నిలిపివేశారు. ఫలితంగా టన్ను ఇసుక ధర రూ.1,200 నుంచి రూ.2,200కు చేరింది. దీంతో నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.
వినియోగదారులే నేరుగా తమకు కావాల్సినంత ఇసుకను బుక్ చేసుకునే వీలుకల్పించేందుకు టీజీఎండీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ను రూపొందిస్తున్నారు. ఓలా, ఉబర్ తరహాలో ఉండే ఈ యాప్ ద్వారా వినియోగదారులు ఇసుకను బుక్ చేసుకుని, ఆన్లైన్లో చెల్లింపులు జరిపితే టీజీఎండీసీ వద్ద రిజిస్ట్రేషన్ అయిన వాహనాల ద్వారా సరఫరా చేస్తారు. 1-2 నెలల్లోగా ఈ యాప్ అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.