ఖైరతాబాద్, మే 8 : చికిత్స పొందుతూ రోగి మరణిస్తే.. బాధ్యుడైన వైద్యుడి కుటుంబం పరిహారం చెల్లించాలని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్(టీజీడీఎఫ్) న్యాయ కమిటీ ప్రతినిధి డాక్టర్ ప్రదీప్ వజ్జ కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి వైద్యుడికి ఎమర్జెన్సీ కేసులనేవి సవాల్‌గా ఉంటాయని అన్నారు. చివరి క్షణం వరకు రోగిని రక్షించాలనే వైద్యులు పని చేస్తారని, ఎప్పుడైనా రోగి చనిపోతే వైద్యుడి తప్పు ఉందని అనలేమని చెప్పారు.
ఒకవేళ వైద్యుడి నిర్లక్ష్యంతో రోగి చనిపోతే పరిహారం చెల్లించాలనడంలో తప్పులేదని, కానీ చికిత్స అందించిన వైద్యుడు చనిపోతే అతని కుటుంబ సభ్యులు నష్టపరిహారం చెల్లించాలన్న తీర్పు తమను నిరుత్సాహానికి గురిచేసిందని పేర్కొన్నారు. పునఃపరిశీలన చేసి తీర్పును సవరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ హెడ్ కిరణ్ కుమార్, ఉపాధ్యక్షుడు చేతన్‌రెడ్డి, సురేశ్రాజు పాల్గొన్నారు.