హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): ఎండీల పేరుతో వాట్సాప్‌లో నకిలీ ప్రొఫైళ్లు సృష్టించి, రూ. కోట్లు దోచుకుంటున్న ముఠా గుట్టును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రట్టు చేసింది. రూ. 4.70 కోట్ల ‘వాట్సాప్ బాస్’ ఫ్రాడ్‌కు పాల్పడిన కేసులో బ్యాంక్ ఖాతాలను అందించిన ఇద్దరు ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎస్బీ డీజీ శిఖాగోయెల్ వివరాల ప్రకారం.. బాధితుడి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) పేరు, ఫొటోను ఉపయోగించి గుర్తుతెలియని సైబర్ నేరగాడు నకిలీ వాట్సాప్ ప్రొఫైల్ సృష్టించాడు.
ఆ ప్రొఫైల్ నుంచి వచ్చిన సందేశాలు నమ్మిన బాధితుడు, వివిధ బ్యాంక్ ఖాతాలకు రూ.4.7 కోట్లు బదిలీ చేశాడు. మోసపోయానని గ్రహించి ఫిర్యాదు చేయడంతో టీజీ సీఎస్బీ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన దోసపాటి కృష్ణసాయి, హైదరాబాద్ కొత్తపేటలో ఉంటున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన మండవల్లి శివ నాగరాజు(ఏ6)ను అరెస్ట్ చేశారు.