TG Rains | తెలంగాణ పలు జిల్లాల్లో శుక్రవారం నుంచి ఆదివారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. జార్ఖండ్, పరిసర ప్రాంతాలను ఆనుకొని ఉత్తర ఒడిశా, ఛత్తీస్గఢ్మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి.. ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని తెలిపింది. అలాగే, సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉత్తర-దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి ఇంటీరియర్ తమిళనాడు గుండా కొమోరిన్ ప్రాంతం వరకు ఉందని పేర్కొంది.
ఇక శుక్రవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అలాగే, శనివారం నుంచి ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే సూచనలున్నాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. మంచిర్యాల, జయశంకర్, మహబూబాబాద్, ములుగు, సిద్దిపేటతో పాటు పలు జిల్లాలు, హైదరాబాద్ నగర పరిధిలోని పలుచోట్ల వర్షాపాతం నమోదైంది.