హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఇసుక సరఫరాలో అక్రమాలపై టీజీఎండీసీ దిద్దుబాటు చర్యలకు దిగింది. వాట్సాప్ ద్వారా ఇసుక బుకింగ్ చేసుకునేలా కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇసుక సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు రీచ్‌లు, స్టాక్‌యార్డ్‌ల వద్ద డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయాలని, లారీలకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. ఇసుక సరఫరాలో అక్రమాలపై ఇటీవల లారీ యజమానులు టీజీఎండీసీ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇసుక సరఫరాలో అక్రమాలను సమూలంగా నిర్మూలించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని టీజీఎండీసీ నిర్ణయించింది. అందులోభాగంగానే వాట్సాప్ ద్వారా సులభంగా ఇసుక బుకింగ్ చేసుకొనేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. జీపీఎస్, డ్లోన్ల ద్వారా ఆన్లైన్లో ఇసుక సరఫరా ప్రక్రియను వీక్షించడమే కాకుండా రికార్డుచేసే వీలు కలుగుతుందని వెల్లడించాయి. సాఫ్ట్వేర్, డ్రోన్లు, జీపీఎస్ ప్రక్రియను రెండు నెలల్లోగా పూర్తిచేస్తామని టీజీఎండీసీ చైర్మన్ అనిల్‌కుమార్ పేర్కొన్నారు.