TG High Court | దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నిక వివాదానికి సంబంధించిన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు ముగించింది. గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ గతంలో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో గోపీనాథ్ తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కాంగ్రెస్ నేత అజహరుద్దీన్, నవీన్ యాదవ్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లపై విచారణ జరుగుతున్న తరుణంలోనే గోపీనాథ్ ఇటీవల ఆరోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలుపగా.. విచారణను ముగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. క్వారీ వ్యాపారి మనోజ్‌ను రూ.50 లక్షలు ఇవ్వాలని కౌశిక్‌రెడ్డి బెదిరించినట్లు ఆరోపిస్తూ మనోజ్ భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదైంది. కేసును సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా కౌశిక్‌రెడ్డి తరఫున న్యాయవాది రమణారావు వాదనలు వినిపించారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే కేసు నమోదు చేశారన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌పై తీర్పును వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది.