హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రధాన విద్యుత్తు కేంద్రాల్లో ఒకటైన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్లాంట్‌కు అవసరమైన బొగ్గును సరఫరా సరఫరా చేయాలన్న తెలంగాణ జెన్కో అభ్యర్థనను కోలిండియా తిరస్కరించింది. జెన్కో కుదుర్చుకున్న ఒప్పందాలు అడ్డుగా ఉన్నాయని, కనుక బొగ్గును అందించలేమని స్పష్టం చేసింది. దీంతో నైని కోల్‌బ్లాక్ నుంచి బొగ్గును తెప్పించుకోవడంపై జెన్కో దృష్టి సారించింది. వైటీపీఎస్‌కు సింగరేణి సంస్థ నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం లేదని, ఫలితంగా బూడిద అధికంగా వస్తున్నదని, ప్లాంట్ల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతున్నదని చెప్తున్న జెన్కో అధికారులు.. కోలిండియా నుంచి బొగ్గును తెప్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆ సంస్థకు లేఖ రాశారు. కానీ, కోలిండియా నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో జెన్కో ప్రయత్నాలకు బ్రేక్ పడింది.
సింగరేణితో ఒప్పందమే అడ్డంకి
కోలిండియా నుంచి బొగ్గు సరఫరా చేసేందుకు సింగరేణి, జెన్కో మధ్యనున్న ఫ్యూయల్ సప్లయ్ అగ్రిమెంట్ (ఎఫ్ఎస్ఏ) కీలక అడ్డంకిగా మారింది. వైటీపీఎస్‌కు ఏటా 14 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేసేందుకు సింగరేణి, జెన్కో మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరింది. ఈ లెక్కన సింగరేణి రోజుకు 12 రేకుల బొగ్గును వైటీపీఎస్‌కు సరఫరా చేయాలి. ఇందులో 10 రేకులు తెలంగాణలోని బొగ్గు గనుల నుంచి, మిగిలిన 2 రేకులు ఒడిశాలోని నైని కోల్‌బ్లాక్ నుంచి సరఫరా కావాలి. ఈ ఒప్పందం కొనసాగుతున్నంత కాలం తాము నేరుగా బొగ్గు సరఫరా చేయడం సాధ్యం కాదని కోలిండియా స్పష్టం చేసింది. సింగరేణితో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుని, కొత్తగా తమతో ఫ్యూయల్ సప్లయ్ అగ్రిమెంట్ చేసుకుంటేనే బొగ్గు సరఫరా చేస్తామని కోలిండియా మెలికపెట్టింది. దీంతో జెన్కో అధికారులు కోలిండియా నుంచి బొగ్గును తెప్పించే ప్రయత్నాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
త్వరలో నైని నుంచి బొగ్గు సరఫరా
కోలిండియా నుంచి బొగ్గు తెప్పించేందుకు దారులు మూసుకుపోవడంతో జెన్కో అధికారులు ఒడిశాలోని నైని కోల్‌బ్లాక్ నుంచి బొగ్గు తెప్పించుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఇటీవల నైని బ్లాక్ నుంచి మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రభుత్వం సైతం నైని నుంచి బొగ్గు తీసుకోవాలని జెన్కోకు సూచించింది. ఈ మేరకు జెన్కో డైరెక్టర్ సహా కొందరు అధికారులు ఒడిశాలోని నైని బ్లాక్‌కు వెళ్లి, అక్కడి బొగ్గు నాణ్యతను పరిశీలించారు. ఆ బ్లాక్‌లో జీ-10 గ్రేడ్ రకం బొగ్గు లభిస్తున్నట్టు తేల్చారు. అక్కడి నుంచి రోజుకు 2 రేకుల బొగ్గును తెప్పించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో వారం పది రోజుల్లో సరఫరాను ప్రారంభించాలని ఇటీవల నిర్ణయించారు.