TGGENCO | హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ రంగంలో విద్యుత్తును ఉత్పత్తిచేసే సంస్థ టీజీ జెన్కో తన సంప్రదాయ పద్ధతులను మార్చకోవడంలేదు. మూస, పాత విధానాలను వీడటం లేదు. ఆధునిక సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారడంలేదు. ప్రపంచ దేశాలు సోలార్ వంటి గ్రీన్ఎనర్జీ వైపు పరుగులు పెడుతుంటే జెన్కో మాత్రం జల, బొగ్గు విద్యుదుత్పత్తికే పరిమితమైంది. 2030 నాటికి రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని రాష్ట్రప్రభుత్వం చెబుతున్నది. ఇందులో 5వేల మెగావాట్లు సింగరేణి సంస్థ దక్కించుకోనుండగా, మిగిలిన 15వేల మెగావాట్లలో జెన్కో భాగస్వామ్యం ఎంతో స్పష్టతలేదు. గ్రీన్ఎనర్జీ ఉత్పత్తికి చొరవ చూపకపోతే విద్యుత్తు రంగంపై జెన్కో పట్టు కోల్పోయే ప్రమాదముందని, ఇది సంస్థ మనుగడకు ప్రమాదమని ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రంలో మొదటి సోలార్ ప్లాంట్‌ను జెన్కోదే ఏర్పాటు చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాలలో మెగావాట్ సామర్థ్యం గల ప్లాంట్‌ను నెలకొల్పింది. ఆ తర్వాత పులిచింతల, నిజాంసాగర్, పెద్దపల్లిలో కెనాల్స్ మీద సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు రచించారు. కేటీపీఎస్లోనూ 8 మెగావాట్ల సోలార్‌ప్లాంట్‌కు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. కానీ ఏమైందో ఏమో ఆ ప్రతిపాదనలన్నీ ఆటకెక్కాయి. ప్రైవేట్ ప్లాంట్లు మాత్రం పెద్ద ఎత్తున సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ విద్యుత్తును మన రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థ ట్రాన్స్‌కోకు విక్రయిస్తున్నాయి. ఇదే సోలార్ ఎనర్జీని జెన్కో తక్కువ ధరకు ఉత్పత్తి చేసే అవకాశముందని, కానీ ప్రభుత్వం, అధికారులు ఉద్దేశపూర్వకంగానే సంస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
అత్యంత కీలకమైన, 15,000 కోట్ల ఆదాయం కలిగిన జెన్కోకు ప్రభుత్వం రెగ్యులర్ సీఎండీని, డైరెక్టర్లను నియమించడంలేదు. ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఇన్చార్జి సీఎండీగా, ఇన్చార్జీ డైరెక్టర్లతో సంస్థను నెట్టుకొస్తున్నారు. కొత్త డైరెక్టర్ల నియామకం కోసం దరఖాస్తులు స్వీకరించి నెలలు గడిచినా ప్రక్రియ ముందుకు సాగడంలేదు. మరోవైపు గ్రీన్ఎనర్జీ వైపు దృష్టి పెట్టకుండా రామగుండంలోని ఆర్టీఎస్-బీ ప్లాంట్ స్థానంలో సింగరేణి భాగస్వామ్యంతో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో సింగరేణి సంస్థ ఆదర్శవంతమైన విధానాలను అనుసరిస్తున్నదని పేరుంది. మొదట్లో కేవలం బొగ్గు వెలికితీతకే పరిమితమైన సంస్థ కాలానుగుణంగా మారుతున్నది. వివిధ రాష్ర్టాలు, దేశాల్లో బొగ్గు వెలికితీత, విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణ పనులను చేపడుతున్నది. కానీ జెన్కో మాత్రం సంప్రదాయ పద్ధతులను వీడకపోవడం సంస్థకు నష్టమని, ప్రైవేటు భాగస్వామ్యం, ఆధిపత్యం పెరిగితే ప్రజలపై భారం పడుతుందని విద్యుత్తు రంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.