హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : టీజీ ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. మే డే సందర్భంగా గురువారం పరీక్షలకు విరామం ప్రకటించారు. ఇంజినీరింగ్ విభాగానికి ఈ నెల 2,3,4 తేదీల్లో మొత్తం ఆరు సెషన్లల్లో పరీక్షలు జరుగుతాయి. ఇంజనీరింగ్ విభాగానికి 2,20,117 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎప్సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షలు బుధవారంతో ముగిశాయి.
మంగళవారం రెండు సెషన్లు, బుధవారం ఒక సెషన్లో పరీక్షలు నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి బుధవారం బాచుపల్లిలోని వీఎన్నార్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కాలేజీ సెంటర్ను సందర్శించారు. ప్రశ్నలు సులభంగానే వచ్చినట్టు విద్యార్థులు తెలిపారు. ఎప్సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల ప్రాథమిక కీ ఈ నెల 4న విడుదల కానుంది. అగ్రికల్చర్, ఫార్మసీ రెండు విభాగాల ప్రాథమిక కీని మధ్యాహ్నం 2గంటలకు జేఎన్టీయూ అధికారులు విడుదల చేస్తారు. విద్యార్థులు ఈ నెల 6 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు.
హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును అధికారులు పొడిగించారు. ఫీజు చెల్లింపు గడువు గురువారంతో ముగియనుండగా, మే 2 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇచ్చారు.