హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్సెట్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యయి. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం విద్యార్థులకు ఉదయం, మధ్యాహ్నం సెషన్లో పరీక్షలు నిర్వహించారు. ప్రశ్నలు మధ్యస్తం నుంచి కాస్త కఠినంగా ఉన్నట్టు విద్యార్థులు తెలిపారు. మొదటి సెషన్లో ఫిజిక్స్ ప్రశ్నలు కఠినంగా వచ్చాయి. జువాలజీ, కెమిస్ట్రీ ప్రశ్నలు సులభంగా ఇవ్వగా, బోటనీ ప్రశ్నలు మధ్యస్తంగా ఉన్నట్టు విద్యార్థులు తెలిపారు. మధ్యాహ్నం సెషన్లోనూ ప్రశ్నలు ఇదే తీరులో ఉన్నట్టు విద్యార్థులు వెల్లడించారు. ఎప్సెట్ పరీక్షల తొలిరోజే 3,959 మంది గైర్హాజరయ్యారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి పలు పరీక్షాకేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎప్సెట్ పరీక్షకు నిమిషం ఆలస్యంగా వచ్చి ఓ విద్యార్థిని పరీక్షరాసే అవకాశాన్ని కోల్పోయింది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్కు చెందిన స్పందన మధ్యాహ్నం సెషన్లో ఎప్సెట్ పరీక్ష రాసేందుకు ఘట్కేసర్లోని శ్రీనిధి కాలేజీకి వచ్చింది. కాలేజీ అడ్రస్ తెలియకపోవడంతో అడుక్కుంటూ వచ్చే సరికి 3:01 నిమిషాలయ్యింది. నిమిషం ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్షకు అనుమతించలేదు.
టెట్ దరఖాస్తుకు నేడే ఆఖరు
హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్(టెట్) పరీక్ష దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగియనున్నది. మంగళవారం వరకు 1,34,011 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోనివారు బుధవారం వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.