హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 2026 -27 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. ఎప్‌సెట్ పరీక్షలను 2026 మే 4 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి ప్రకటించారు. మంగళవారం ఎప్‌సెట్ సహా పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ విడుదల చేశారు.
మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మే 5 నుంచి 8 వరకు విరామం ఉంటుంది. మే 9 నుంచి 11 వరకు మూడు రోజులపాటు ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహిస్తారు. రెండు రోజుల్లో మూడు సెషన్లపాటు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు ఉంటాయి. మూడు రోజులపాటు ఆరు సెషన్లలో ఇంజినీరింగ్ విభాగం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి సెషన్ పరీక్షలను ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో సెషన్ పరీక్షలను మధ్యాహ్నం 3 నుంచి సాయ ంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు.
ఎప్పుడు ముందుగా జరిగే ఈసెట్ ప్రవేశ పరీక్ష ఈ సారి ఆలస్యంగా జరుగనున్నది. ఈ పరీక్షను ఎప్‌సెట్, ఎడ్‌సెట్, ఐసెట్ పరీక్షల తర్వాత నిర్వహిస్తారు. ఈ సారి ఎంట్రెన్స్ టెస్ట్‌లు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరుగనున్నాయి. అన్ని పరీక్షలు మే మాసంలో జరుగనుండగా, ఒక్క పీఈసెట్ మాత్రం మేలో ప్రారంభమయ్యి జూన్‌లో ముగుస్తుంది. ఎప్‌సెట్ పరీక్షల తర్వాత మే 12న ఎడ్‌సెట్, మే 13, 14 తేదీల్లో ఐసెట్ పరీక్షలు జరుగుతాయి.
ఆ వెంటనే మే 15న ఈసెట్ పరీక్ష ఉంటుంది. మే 18న లాసెట్, పీజీలాసెట్ పరీక్షలు ఉండగా, పీజీఈసెట్ పరీక్షలు మే 28 నుంచి 31 వరకు నిర్వహిస్తారు. బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీఈసెట్‌కు ఎలాంటి పరీక్షలు ఉండవు. కొన్ని ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించి, ఆయా మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. ఇవి మే 31 నుంచి జూన్ 3 వరకు జరుగుతాయి. వీలైనంత త్వరగా సెట్ కమిటీ సమావేశాలు నిర్వహించి ఫిబ్రవరిలో ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్ విడుదల చేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు.
ఎప్‌సెట్ సహా పలు ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సందేహాల నివృత్తికి హెల్ప్లైన్లు అందుబాటులోకి తీసుకొస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి వెల్లడించారు. దరఖాస్తు విధా నం, ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల అప్లోడింగ్ వంటి అంశాలపై ఎలాంటి సందేహాలున్నా విద్యార్థులు ఈ హెల్ప్లైన్లు ఆశ్రయించవచ్చని సూచించారు. మంగళవారం ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల చేసిన తర్వాత విలేకరులతో ముచ్చటించారు. పరీక్షకు ముందురోజు విద్యార్థులు/ తల్లిదండ్రుల మొబైల్‌కు ఎస్ఎంఎస్ అలర్ట్ పంపించే ఆలోచన చేస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ) : టీజీఎప్‌సెట్ కన్వీనర్‌గా నియామకమైన సీమాంధ్ర వ్యక్తి విజయ్‌కుమార్‌రెడ్డిని వెంటనే తొలగించాలని బీసీ జనసభ ప్రెసిడెంట్ రాజారామ్‌యాదవ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన, అర్హత కలిగిన ప్రొఫెసర్‌నే ఎప్‌సెట్ కన్వీనర్‌గా నియమించాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణలో అర్హులు ఉన్నా, ఏపీకి చెందిన వ్యక్తిని నియమించడం తెలంగాణ ఆత్మగౌరవానికి, రాష్ట్ర ప్రయోజనాలకు అవమానకరమని మం డిపడ్డారు.
గతంలో సింగరేణి ఉద్యోగుల ప్రవేశపరీక్ష కన్వీనర్‌గా వ్యవహరించిన సమయంలో ఆయనపై పరీక్ష పత్రాల లీక్ ఆరోపణలు ఉన్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ర్టానికి చెందిన వ్యక్తినే ఎప్‌సెట్ కన్వీనర్‌గా నియమించాలని డిమాండ్‌చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
