JOST | హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఇంటర్లో ఆన్లైన్ అడ్మిషన్లకు రంగం సిద్ధమవుతున్నది. డిగ్రీ అడ్మిషన్లకు అనుసరిస్తున్న ‘దోస్త్’ తరహాలోనే ఇంటర్లో జూనియర్ కాలేజీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (జోస్త్) విధానాన్ని తీసుకురానున్నారు. ఇంటర్ బోర్డు వచ్చే విద్యాసంవత్సరం(జూన్) నుంచి ఫస్టియర్‌కు ఆన్లైన్లోనే అడ్మిషన్లు కల్పిస్తారు. పదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్‌ను బట్టి, విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్ల ప్రకారం సీట్లు భర్తీచేస్తారు. డిగ్రీ సీట్లను ‘దోస్త్’ ద్వారా భర్తీచేస్తున్నారు. ఈ విధానంతో ప్రైవేట్ కాలేజీల ఆగడాలకు అడ్డుకట్టపడింది. ఇదే తరహాలో ఇంటర్‌లోనూ అడ్మిషన్లు కల్పించనున్నారు. ఇది వరకు పదో తరగతిలో గ్రేడింగ్ విధానముండటంతో మెరిట్ ప్రకారం సీట్లను కేటాయించలేని పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది నుంచి పదో తరగతిలో గ్రేడింగ్ విధానాన్ని రద్దుచేశారు. విద్యార్థులకు గ్రేడ్ల స్థానంలో మార్కులను జారీచేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో 1200 పైచిలుకు ప్రైవేట్ కాలేజీన్నాయి. కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో అడ్మిషన్ల విషయంలో ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా సాగుతున్నది. పదో తరగతి పరీక్షలుకాకముందే, ఫలితాలు వెలువడకముందే, ఇంటర్ అడ్మిషన్ నోటిఫికేషన్ రాకముందే డిసెంబర్లోనే ముందస్తు అడ్మిషన్లు చేసుకుంటున్నాయి. ఇది నిబంధనలకు విరుద్ధం. దీంతో సర్కారు కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఉండకపోవడంతో అవి కునారిల్లుతున్నాయి. కొత్త విధానంతో ఆన్లైన్లో గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను పొందుపరుస్తారు. విద్యార్థులు ప్రాధాన్య క్రమంలో ఆప్షన్లు ఎంచుకోవాలి. ఆప్షన్లు, మెరిట్‌ను అనుసరించి సీట్లు కేటాయిస్తారు. దీంతో సర్కారు, ప్రైవేట్ కాలేజీలన్న తేడాల్లేకుండా ఒకేసారి అడ్మిషన్లు కల్పించడంతో అడ్మిషన్ల దందాకు చెక్‌పడనుంది. ఆన్లైన్ అడ్మిషన్లతో విద్యార్థి తనకు నచ్చిన కాలేజీలో చేరే అవకాశముంటుంది.
ఆన్లైన్లో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు కల్పించాలని భావిస్తున్న విద్యాశాఖకు ఇప్పుడు ఫీజుల రూపంలో కొత్త సమస్య తలెత్తనుంది. ఇంటర్ కోర్సుల ఫీజులను ఇప్పటి వరకు ఖరారుచేయలేదు. ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి. ఆన్లైన్లో అడ్మిషన్లు కల్పిస్తే ఫీజులెలా..? ఎవరికి చెల్లించాలన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. సర్కారు కాలేజీల్లో ఉచిత విద్యనందిస్తున్నారు. మాడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో కొత్త అడ్మిషన్లు కల్పించడంలేదు. ఉన్న విద్యార్థులనే అప్‌గ్రేడ్ చేస్తున్నారు. కార్పొరేట్ కాలేజీల్లో చేరేవారు హాస్టల్, ఎప్‌సెట్, జేఈఈ, నీట్ వంటి కోచింగ్‌ను ప్రమాణికంగా తీసుకుంటారు. వీటన్నింటిని ఎలా పరిష్కరిస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆన్లైన్లో ప్రవేశాలు కల్పిస్తుండటంతో ఫీజులు పెంచాల్సి ఉంటుందన్న వాదనలున్నాయి.