రాజన్న సిరిసిల్ల, జూలై 7 (నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల జిల్లా జేఎన్టీయూలో టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సు ఎత్తివేశారు. కేసీఆర్ సర్కార్ హయాంలో ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత ఇక్కడే ప్రారంభించిన కోర్సుకు తాజాగా ఇంజినీరింగ్ ప్రవేశాల్లో వెబ్ ఆప్షన్‌ను తొలగించారు. ఇక్కడ వసతులు, పూర్తిస్థాయి బోధనా సిబ్బంది లేకపోవడంతో మూడేండ్లుగా ఈ కోర్సులో ఎవరూ చేరకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కేసీఆర్ హయాంలో కార్మిక, ధార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో మెడికల్, అగ్రికల్చర్, నర్సింగ్, అగ్రికల్చర్ పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేశారు. 2020లో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్)ను మంజూరు చేయగా, తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. భవన నిర్మాణం కోసం రూ.400కోట్లు అంచ నా వేశారు. 2021-22లో తాత్కాలికంగా వేములవాడ మండలం అగ్రహారంలోని డిగ్రీకళాశాలలో ప్రారంభించారు. తొలిబ్యాచ్‌లో 14 మంది కోర్సు లో చేరి 2025లోఉద్యోగాల్లో చేరారు.